భారత్‌ విజయలక్ష్యం 329 పరుగులు

x87c6panప్రపంచకప్‌ రెండో సెమీ ఫైనల్‌లో టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్‌ భారత్‌ ముందు 329 పరుగుల విజయ లక్ష్యాన్ని ఉంచింది. సిడ్నీలో ఫ్లాట్‌ పిచ్‌ మీద భారత బౌలర్లు ఇంతకు ముందు మ్యాచ్‌ల్లో చూపించిన ప్రభావాన్ని చూపలేకపోయారు. ఉమేశ్‌ యాదవ్‌, మోహిత్‌లు ఆరు వికెట్లు తీసినా.. నిర్ణీత ఓవర్లలో 70కి మించి పరుగులు ఇచ్చారు. మిగతా బౌలర్లు కూడా అంత పెద్ద ప్రభావం చూపించలేకపోయారు. అశ్విన్‌ ప్రమాదకరంగా పరిణమిస్తున్న మాక్స్‌వెల్‌ను ఔట్‌ చేసి వూరట కలిగించినా తర్వాత వచ్చిన బ్యాట్స్‌మెన్లు కొద్దిసేపే క్రీజులో ఉన్నా.. తమపై జట్టు పెట్టుకున్న ఆశలను వమ్ము చేయలేదు. ప్రారంభంలో విధ్వంసకర బ్యాటింగ్‌ ఆడే వార్నర్‌ను తక్కువ స్కోరుకే పెవిలియన్‌కు పంపించినా.. ఫామ్‌లో ఉన్న స్మిత్‌ బంతికి ఒక పరుగుపై బడి ఆడుతూ శతకం సాధించి ఆసీస్‌ బ్యాటింగ్‌కి వూపు తెచ్చాడు. 34 ఓవర్ల వరకూ క్రీజులో ఉన్న స్మిత్‌ ఏ దశలోనూ భారత బౌలర్లు పైచేయి సాధించటానికి అవకాశం ఇవ్వలేదు. మరోవైపు ఫించ్‌ తన సహజ సిద్ధమైన దూకుడును పక్కనబెట్టి స్మిత్‌కు అండగా నిలిచాడు. పవర్‌ప్లే ముందు, స్మిత్‌ ఔట్‌ అయిన తర్వాత భారత్‌ త్వరత్వరగా వికెట్లు తీసి పరుగుల వేగానికి అడ్డుకట్ట వేసినా.. ఫాల్కనర్‌, వాట్సన్‌, జాన్సన్‌లు వేగంగా పరుగులు తీసి ఆఖర్లో స్కోరు బోర్డుకు దూకుడు తెచ్చారు. ముఖ్యంగా జాన్సన్‌ 9 బంతుల్లోనే 4 ఫోర్లు, ఒక సిక్స్‌ సహాయంతో 27 పరుగులు చేసి భారత్‌ వ్యూహాన్ని ా’ాదించాడు.భారత బౌలర్లలో క్రమం తప్పకుండా వికెట్లు తీస్తున్న షమీకి సెమీస్‌లో ఒక వికెట్‌ కూడా రాలేదు. ఉమేశ్‌ 4, మోహిత్‌ 2, అశ్విన్‌ 1 వికెట్‌ తీశారు. స్మిత్‌(105) శతకం చేయటంతో పాటు ఓపెనర్‌ ఫించ్‌ 81 పరుగులు సాధించి ఆస్గేలియా పెద్దస్కోరు సాధించటంలో దోహదపడ్డారు. భారత్‌ బౌలింగ్‌తోపాటు ఫీల్డింగ్‌ కూడా గత మ్యాచ్‌ల్లో ఉన్నంత పకడ్బంధీగా లేకపోవటం గమనార్హం. గత మ్యాచ్‌ల్లో ప్రత్యర్థులను ఆలౌట్‌ చేసిన భారత్‌ ఈ మ్యాచ్‌లో ఏడు వికెట్లు మాత్రమే తీయగలిగింది. మంచి ప్రారంభం ఇచ్చే పిచ్‌ మీద ఏదైనా సాధ్యం కావచ్చు. భారత్‌ వికెట్లు కాపాడుకోవటంతో పాటు రన్‌రేట్‌పై దృష్టిపెట్టి ఆడాల్సి ఉంటుంది.