భారత్‌ వినతిని గౌరవిస్తాం

– యాంటిగ్వా విదేశాంగ మంత్రి ఈపీ ఛెట్‌ గ్రీనీ
– మెహుల్‌ ఛోక్సీకి ఎదురుదెబ్బ
న్యూఢిల్లీ, జులై28(జ‌నం సాక్షి) : భారత్‌, యాంటిగ్వా మధ్య ఎక్స్‌ట్రాడిషన్‌ ట్రీటీ(దోషుల అప్పగింతపై రెండు దేశాల మధ్య ఒప్పందం) లేకపోయినా భారత్‌ వినతిని తాము గౌరవిస్తామని యాంటిగ్వా విదేశాంగ మంత్రి ఈపీ ఛెట్‌ గ్రీనీ తెలిపారు. మెహుల్‌ ఛోక్సీ గురించి భారత ప్రభుత్వం నుంచి ఇంతవరకు ఎలాంటి అభ్యర్థన రాలేదని, వస్తే మాత్రం ఆ వినతిని మేం గౌరవిస్తామని స్పష్టం చేశారు. దీంతో పీఎన్‌బీ కుంభకోణం నిందితుల్లో ఒకరైన మోహల్‌ ఛోక్సీకి ఎదురుదెబ్బ తగిలినట్లయింది. వివరాల్లోకి వెళితే.. బ్యాంకింగ్‌ వ్యవస్థలో సంచలనం సృష్టించిన పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు(పీఎన్‌బీ) కుంభకోణం కేసులో ప్రధాన నిందితుల్లో ఒకరైన మెహల్‌ ఛోక్సీ యాంటిగ్వాలో ఉన్నట్లు తెలిసింది. అంతేగాక.. తాను ఆ దేశంలో పౌరసత్వం కూడా పొందినట్లు ఛోక్సీ స్వయంగా వెల్లడించడం గమనార్హం. దీంతో ఛోక్సీని స్వదేశానికి రప్పించడం మరింత కష్టమవుతుందేమోనని భారత అధికారులు భావించారు. అయితే ఈ విషయంలో భారత్‌కు ఊరట కల్గించేలా యాంటిగ్వా ప్రభుత్వం స్పందించింది. ఛోక్సీని భారత్‌కు తీసుకెళ్లేందుకు ఆ దేశం వినతిని తాము గౌరవిస్తామని యాంటిగ్వా ప్రభుత్వం స్పష్టం చేసింది. దీంతో ఛోక్సీకి ఎదురుదెబ్బ తగిలినట్లయింది.
భారత్‌, యాంటిగ్వా మధ్య ఎక్స్‌ట్రాడిషన్‌ ట్రీటీ(దోషుల అప్పగింతపై రెండు దేశాల మధ్య ఒప్పందం) లేదు. దీంతో యాంటిగ్వాలో ఉంటే భారత్‌ తనను వెనక్కి రప్పించలేదని భావించిన ఛోక్సీ.. ఆ దేశం వెళ్లి అక్కడి పౌరసత్వం తీసుకున్నాడు. ఈ పౌరసత్వం ఉంటే 130 దేశాలకు వీసా లేకుండా తిరిగే సదుపాయం లభిస్తుంది. అయితే ఛోక్సీ వివాదంపై యాంటిగ్వా ప్రభుత్వం భారత్‌కు అనుకూలంగా స్పందించింది. ఇరు దేశాల మధ్య ఒప్పందం లేకపోయినా భారత అభ్యర్థనను తాము గౌరవిస్తామని యాంటిగ్వా విదేశాంగ మంత్రి ఈపీ ఛెట్‌ గ్రీనీ తెలిపారు. ఛోక్సీ గురించి భారత ప్రభుత్వం నుంచి ఇంతవరకు ఎలాంటి అభ్యర్థన రాలేదని, ఒకవేళ వస్తే మాత్రం ఆ వినతిని మేం గౌరవిస్తామని గ్రీనీ స్పష్టం చేశారు. వ్యాపార విస్తరణకే తాను యాంటిగ్వా పౌరసత్వం తీసుకున్నట్లు మెహుల్‌ ఛోక్సీ శుక్రవారం వెల్లడించిన విషయం తెలిసిందే.