భారత్‌ సహనం అలుసుగా భావించవద్దు

untitled-15
– పాక్‌కు వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ హితవు

వాషింగ్టన్‌,సెప్టెంబర్‌ 28(జనంసాక్షి): భారత్‌ నిగ్రహాన్ని పాకిస్థాన్‌ సరిగ్గా అర్థం చేసుకోక, చేతగానితనంగా భావిస్తే అది అంతర్జాతీయంగా ఏకాకి అయ్యే ప్రమాదముందని అమెరికా విూడియా హెచ్చరించింది. యూరి ఘటన అనంతరం భారత ప్రధాని మోదీ వెంటనే సైనిక చర్యకు దిగక ఎంతో సహనం పాటిస్తున్నారని, ఇది మెచ్చుకోదగిన విషయమని వాల్‌ స్ట్రీట్‌ జర్నల్‌ ప్రసంశించింది. అయితే దీనిని అసమర్థతగా పాక్‌ భావిస్తే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని కూడా హెచ్చరించింది. అయితే భారత వ్యూహాత్మక సహనం అన్ని వేళలా పని చేయదన్నని పాక్‌ గ్రహించాలని ఆ పత్రిక హెచ్చరించింది. పాక్‌ మరిన్ని ఉగ్రదాడులకు దిగితే భారత్‌ పూర్తిస్థాయి యుద్దానికి దిగాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని అమెరికా విూడియా అంచనా వేసింది. భారత ప్రధాని మోదీ సైనిక చర్యకు బదులు పాక్‌ను అంతర్జాతీయంగా ఏకాకిని చేసేందుకు ప్రయత్నిస్తున్నారని వాల్‌ స్ట్రీట్‌  జర్నల్‌ పేర్కొంది. అంతేగాక ఇండస్‌ వాటర్‌ నిలుపుదల, ఆ దేశంతో వాణిజ్య సంబంధాల రద్దుతో పాకిస్థాన్‌కు ఊహించని విధంగా బుద్ధి చెప్పేందుకు మోదీ సిద్ధమయ్యారని ఆ పత్రిక అభిప్రాయపడింది. పాకిస్థాన్‌ ఇప్పటికైనా ఉగ్రవాదాన్ని వీడి మోదీకి సహకరించేందుకు ముందుకు వస్తే మంచిదని, లేని పక్షంలో అంతర్జాతీయ సమాజం ఆ దేశాన్ని వెలివేసే పరిస్థితి ఉత్పన్నమయ్యే అవకాశముందని అమెరికా విూడియా హెచ్చరించింది.

పాకిస్థాన్‌ చూస్తూ ఊరుకోదు: ముషార్రఫ్‌

ముషారఫ్‌ మరోమారు పేలారు. సింధు నది నుంచి తమ దేశానికి నీళ్లు రాకుండా భారత్‌ అడ్డుకుంటే చూస్తూ ఊరుకోబోమని పాకిస్థాన్‌ మాజీ అధ్యక్షుడు పర్వేజ్‌ ముషార్రఫ్‌ హెచ్చరించారు. ప్రతిఘటిచేందుకు సిద్ధంగా ఉంటామని ‘ఇండియా టుడే’ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. నీళ్లపై నియంత్రణతో రెండు దేశాల మధ్య వివాదం మరింత ముదిరే అవకాశముందని అభిప్రాయపడ్డారు. భారత్‌తో తలపడాలని తాము కోరుకోవడం లేదని, శాంతిపక్రియ ద్వారానే కశ్మీర్‌ సమస్య పరిష్కారమవుతుందని విశ్వసిస్తున్నామని పేర్కొన్నారు. పుట్టినరోజు పర్యటనలు ఎల్లప్పుడు సమస్యలను పరిష్కరించలేవని అన్నారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేకంగా పాకిస్థాన్‌ వెళ్లి నవాజ్‌ షరీఫ్‌ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన నేపథ్యంలో ముషార్రఫ్‌ ఈ వ్యాఖ్య చేశారు. ప్రతిదానికి పాకిస్థాన్‌ ను నిందించడం సరికాదన్నారు. యూరీ  సైనిక స్థావరంపై జరిగిన ఉగ్రవాదుల దాడికి పాకిస్థాన్‌ కారణమంటూ రాజకీయ ప్రయోజనాల కోసమే ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. ఐక్యరాజ్యసమితిలో సుష్మా స్వరాజ్‌ ప్రసంగం డాబుసరిగా ఉందని విమర్శించారు. సార్క్‌ సమావేశాల నుంచి భారత్‌ తప్పుకోవడం బాధాకరమని వ్యాఖ్యానించారు. భారత్‌ ప్రభావితం చేయడం వల్లే అప్ఘనిస్థాన్‌, బంగ్లాదేశ్‌ కూడా సార్క్‌ సదస్సుకు దూరమయ్యాయని ఆరోపించారు. బలూచిస్థాన్‌ లో పాకిస్థాన్‌ జాతీయ పతకాలను తగులబెట్టిన వారికి కఠిన శిక్షలు తప్పవని హెచ్చరించారు.