భారత కరెన్సీ ముద్రణపై కేంద్రం క్లారిటీ

చైనాలో ముద్రణ వార్తలను ఖండించిన ఆర్థిక శాఖ

న్యూఢిల్లీ,ఆగస్ట్‌14(జ‌నం సాక్షి): చైనాలో భారత కరెన్సీ ముద్రిస్తున్నారని వచ్చిన వార్తలను కేంద్రం ఖండించింది. ఇండియాతో పాటు పలు ఇతర దేశాల కరెన్సీ నోట్లను ముద్రించే భారీ ఆర్డర్‌ చైనాకు దక్కిందని అక్కడి సౌత్‌ చైనా మార్నింగ్‌ పోస్ట్‌ పత్రిక రాసిన కథనం తీవ్ర ఆందోళన కలిగించిన విషయం తెలిసిందే. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. మన కరెన్సీని మన శత్రు దేశమైన పాకిస్థాన్‌కు సన్నిహితంగా ఉండే చైనాలో ముద్రించడం ఏంటన్న ప్రశ్నను చాలా మంది లేవనెత్తారు. అయితే దీనిపై కేంద్ర ప్రభుత్వం మంగళవారం స్పందించింది. ఇండియన్‌ కరెన్సీని చైనాలో ముద్రిస్తున్నారన్న వార్తలు పూర్తి నిరాధారమైనవని స్పష్టంచేసింది. చైనాకు చెందిన కరెన్సీ ప్రింటింగ్‌ కార్పొరేషన్‌కు ఇండియన్‌కరెన్సీ ముద్రణ కోసం భారీ ఆర్డర్‌ వచ్చిందన్న వార్తలు పూర్తి నిరాధారం. ఇండియన్‌ కరెన్సీని ఇక్కడి ప్రభుత్వ, ఆర్బీఐ కరెన్సీ ప్రెస్‌లలోనే ముద్రిస్తాం అని ఆర్థిక వ్యవహారాల శాఖ కార్యదర్శి సుభాష్‌ చంద్ర గార్గ్‌ వెల్లడించారు. చైనా బ్యాంక్‌నోట్‌ ప్రింటింగ్‌ అండ్‌ మింటింగ్‌ కార్పొరేషన్‌ అధ్యక్షుడు లియు గుషెంగే ఈ విషయాన్ని చెప్పారని సౌత్‌ చైనా మార్నింగ్‌ పోస్ట్‌ తన కథనంలో చెప్పడం విశేషం. ఇండియాతోపాటు థాయ్‌లాండ్‌, బంగ్లాదేశ్‌, శ్రీలంక, మలేషియా, ఇండియా, బ్రెజిల్‌, పోలాండ్‌ దేశాల కరెన్సీలను చైనా ప్రింట్‌ చేస్తున్నట్లు ఆ పత్రిక వెల్లడించింది. అయితే భారత కరెన్సీ మన మింట్‌లోనే ముద్రితం అవుతోందన్న సంగతి తెలిసిందే.