‘భారత దేశంలో అల్ ఖైదా ముప్పు పెరుగుతోంది’
న్యూఢిల్లీ : భారతదేశంలో జీహాద్‌కు తీవ్రంగా కుట్ర జరుగుతున్నట్లు నిఘా వర్గాలు అంచనా వేస్తున్నాయి. ముంబై దాడుల సూత్రధారి, లష్కరే తొయిబా ఆపరేషన్స్ చీఫ్ జకీ ఉర్ రెహమాన్ లఖ్వీ ఇందుకు ప్రధాన కారకుడుగా భావిస్తున్నాయి. రెండేళ్ళ నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తున్న భారత ఉపఖండంలో అల్‌ఖైదా (ఏక్యూఐఎస్) కీలక ఆపరేటివ్ అబ్దుల్ రెహమాన్‌ను లఖ్వీ ప్రోత్సహిస్తున్నట్లు గమనించింది.
విశ్వసనీయ సమాచారం ప్రకారం భారతదేశంలో ఉగ్రవాదానికి తగిన వేదికను సృష్టించాలని, అందుకు అవసరమైన నిదులను భారీగా ఇస్తామని లఖ్వీ చెప్తున్నట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. ఏక్యూఐఎస్‌కు చెందిన అబ్దుల్ రెహమాన్‌పై ఢిల్లీ పోలీసులు జూన్‌లో అభియోగపత్రం దాఖలు చేశారు. లఖ్వీ సన్నిహితుడు సాజిద్ మిర్ ముంబై దాడుల కుట్రలో భాగస్వామి అని, రెహమాన్‌ను సాజిద్ కలిశాడని, పాకిస్థాన్‌లో శిక్షణ పొందేందుకు యువకులను పంపించాలని అడిగాడని నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. అందుకు భారీ నిధులను ఇస్తామని చెప్పినట్లు తెలుస్తోంది. 2015లో రెహమాన్ పాకిస్థాన్ వెళ్ళాడని, అక్కడ లఖ్వీ, మిర్‌లను కలిశాడని చెప్తున్నారు. కరాచీ విమానాశ్రయంలో రిజిస్ట్రేషన్ ఫార్మాలిటీస్‌ను తప్పించేందుకు ఓ ఐఎస్ఐ ఎస్కార్ట్ రెహమాన్‌తో పాటు ఉన్నాడని అంటున్నారు. అనంతరం రెహమాన్ లష్కరే తొయిబా శిక్షణ కేంద్రంలో శిక్షణ పొందాడని చెప్తున్నారు. ఏక్యూఐఎస్ ఏర్పాటైనట్లు అల్ ఖైదా చీఫ్ అయ్‌మన్ జవహిరి 2014 సెప్టెంబరులో వీడియో టేప్ ద్వారా ప్రకటించాడు. అప్పటి నుంచి భారతదేశంలోని ఉగ్రవాద వ్యతిరేక సంస్థలను ఏక్యూఐఎస్ సవాలు చేస్తోంది.
ఏక్యూఐఎస్ వివిధ నేపథ్యాలు ఉన్నవారిని ఉగ్రవాదంలోకి దించుతోందని నిఘా వర్గాలు చెప్తున్నాయి. పాకిస్థాన్ స్పాన్సర్ల నుంచి శిక్షణతో పాటు నిధులను కూడా సమకూరుస్తోందంటున్నాయి. ఢిల్లీ పోలీసులు 17 మంది ఏక్యూఐఎస్ ఆపరేటివ్స్‌పై ఛార్జిషీట్ దాఖలు చేశారు. ఏక్యూఐఎస్ పశ్చిమ ఉత్తర ప్రదేశ్‌లో ఉగ్రవాద కేంద్రాన్ని ఏర్పాటు చేసి, దేశంలో దాడులకు పాల్పడాలని ప్రణాళికలు రచిస్తోందని ఆరోపించారు.