భారీగా తరలివస్తున్న భక్తులు 

తిరుమల,డిసెంబర్‌28(జ‌నంసాక్షి):  వైకుంఠ ఏకాదశి, ద్వాదశి పర్వదినాలను పురస్కరించుకుని తిరుమలకు  భక్తకోటి రాక పెరిగింది. సోమవారం పెద్ద ఎత్తున భక్తులు క్యూలైన్లలో చేరారు. ఉదయం నుంచే భక్తులు స్వామి దర్శనానికి క్యూ కట్టారు. మరోవైపు వైకుంఠ ఏకాదశి, ద్వాదశిని పురస్కరించుకుని  శ్రీవారి దర్శనం, వైకుంఠ ద్వార ప్రవేశం కల్పనకు  టిటిడి సకల ఏర్పాట్లను చేసింది. పవిత్రత ఉట్టిపడేలా, భక్తులకు అహ్లాదం కలిగించేలా తిరుమలలో పుష్పాలంకరణలు, విద్యుద్దీపాలంకరణలను చేపట్టారు.  వైకుంఠ ఏకాదశి, ద్వాదశి పర్వదినాల సందర్భంగా శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వారాలను తెరచి ఉంచనున్నారు. శ్రీవారి దర్శనం చేసుకుని వైకుంఠ ద్వార ప్రదక్షిణ కోసం భక్తకోటి అశేషంగా తిరుమలకు తరలివస్తోంది. రెండు పర్వదినాల్లో తిరుమలకు వచ్చే భక్తులకు ఏరోజుకు ఆరోజే దర్శనం, వైకుంఠ ద్వార ప్రదక్షిణకు అవకాశం కల్పించాలనే లక్ష్యంతో పలు చర్యలు  తీసుకుంది.  గతం కంటే మెరుగైన సేవలందించే దిశగా గత అనుభవాలతో చర్యలు చేపట్టింది.  వైకుంఠ ద్వారాలు తెరిచిన వెంటనే పాసులు పొందిన ప్రొటోకాల్‌ పరిధిలోని ప్రముఖులకు బ్రేక్‌ దర్శన అవకాశం కల్పిస్తారు.  వీరికి లఘు దర్శనం కల్పించి రెండు గంటలు అటు.. ఇటుగా సమయం పరిమితం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.  అనంతరం ఉదయం 4 గంటలకు ధర్మదర్శనం ప్రారంభించాలని నిర్ణయించారు.  ధర్మదర్శనం మినహా ఎలాంటి దర్శనాలకు అనుమతించ రాదని నిర్ణయించారు. ఈ రెండు పర్వదినాల్లో 42 గంటల వరకు సామాన్య భక్తులకే ప్రత్యేక అవకాశం ఇస్తున్నట్లు ఇవో ఇప్పటికే వెల్లడించారు. నారాయణగిరి ఉద్యానవనంలో చక్కగా క్యూలైన్లు ఏర్పాటు, అనుసంధానంగా తాత్కాలిక కంపార్ట్‌మెంట్ల నిర్మాణం, సేదతీరడానికి వీలుగా ఏర్పాట్లు చేశారు.  సామూహిక భజన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.  ఇక్కడే 20 వేల మంది భక్తులు స్వామి దర్శనానికి వేచి ఉండే విధంగా సౌకర్యాలు కల్పనతో పాటు నిరంతరాయంగా అన్నప్రసాదాలు, పానీయాలు అందించే చర్యలు తీసుకున్నారు.  ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల కోసం ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశారు.