భారీ వర్షలతో పొంగుతున్న వాగులు
మచిలీపట్నం,ఆగస్టు13(జనం సాక్షి): కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాలను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. కృష్ణా జిల్లా వ్యాప్తంగా ఎడతెరపిలేని వర్షం కురుస్తోంది. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. వర్షం ధాటికి మున్నేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. అటు ప్రకాశం బ్యారేజ్‌కు ఇన్‌ఫ్లో క్రమక్రమంగా పెరుగుతోంది. దీంతో అధికారులు బ్యారేజ్ గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. మరోవైపు భారీ వర్షాలకు మోపిదేవి, చల్లపల్లి, ఘంటసాల మండలాల్లో పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. దాదాపు 800 ఎకరాల్లో వరి పంట నీటమునింది. అవనిగడ్డ, నాగాయలంక, కోడూరు మండలాల్లో నారుమళ్లు నీటమునిగాయి. దీంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షాల నేపథ్యంలో కలెక్టర్, అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజల అప్రమత్తంగా ఉండాలని సూచనలు జారీ చేశారు. కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. అటు పశ్చిమగోదావరి జిల్లా వ్యాప్తంగా కుండపోత వర్షం కురుస్తోంది. దీంతో గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. పోలవరం దగ్గర గోదావరి నీటి మట్టం 10.6 విూటర్లుకు చేరింది. జంగారెడ్డిగూడెం పరిసరాల్లో ఎడతెరపిలేని వర్షం కురుస్తుండటంతో జల్లేరు, బైనేరు, పాల, రేల వాగులు పొంగిపొర్లుతున్నాయి.