భారీ వర్షానికి పొంగిన వాగులు, వంకలు * నీటితో నిండిన చెరువులు, కుంటలు
జూలూరుపాడు, ఆగష్టు 8, జనంసాక్షి: మండలంలో ఆదివారం అర్థరాత్రి నుంచి తెల్లవారుజాము వరకు కురిసిన భారీ వర్షానికి వాగులు, వంకలు వరద ఉధృతితో పొంగి పొర్లాయి. అటవీ ప్రాంతంలోని కనకగిరి గుట్టలపై నుంచి వచ్చిన వరదతో రాళ్లవాగు పొంగి ప్రవహించింది. సూరారం గ్రామంలోని జనావాసాల వరకు వరద నీరు చేరుకుంది. గ్రామస్తులు వ్యవసాయ పనులకు వెళ్లాల్సి ఉండటంతో వాగు దాటేందుకు అంతరాయం ఏర్పడింది. జూలూరుపాడు గ్రామం నుంచి పాపకొల్లు వెళ్లే మార్గంలో జడలచింత గ్రామం సమీపంలో ఉన్న తుమ్మలవాగు చప్టాపై నుంచి వరద ప్రవహించడంతో రాకపోకలు నిలిచాయి. పడమట నర్సాపురం నుంచి బేతాళపాడు వెళ్లే మార్గంలోని తుమ్మలవాగు లోలెవల్ వంతెన వద్ద రాకపోకలకు ఆటంకం ఏర్పడింది. నల్లబండబోడు గ్రామం ముందు సీతారామ ప్రాజెక్టు కాల్వపై తాత్కాలికంగా నిర్మించిన రోడ్డుకు కాల్వ నీళ్లు పోటెత్తడంతో ప్రమాదకరంగా మారింది. గుండ్లరేవు, బేతాళపాడు, కరివారిగూడెం ప్రాంతాల్లోని పెద్దవాగు పరివాహక ప్రాంతం వరద నీటిమయమైంది. వీటితో పాటు మండలంలోని కాకర్ల ఎర్రవాగు ప్రాజెక్టు, పాపకొల్లులోని దండాల చెరువు, కూచికుంట, కొత్తూరు శనగ చెరువు, జూలూరుపాడు కప్పలకుంట, గుండెపుడి మేడికుంట, పడమట నర్సాపురం గోపాలకుంట పలు చెరువులు నీటితో నిండాయి. భారీ వర్షానికి పలు చోట్ల రోడ్లు దెబ్బతిన్నాయి. కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలకు పల్లెల్లోని అంతర్గత రహదారులు బురదమయంగా మారాయి.