భారీ వర్షాలకు పొంగిపోర్లతున్న వాగులు, వంకలు ఇబ్బందులు పడుతున్న ప్రజలు, పట్టించుకోని ప్రజాప్రతినిధులు అధికారులు
మండల కేంద్రంతో పాటు ఆర్.గార్లపాడు వావిలాల, ఉదండాపురం, చాగాపురం, సాబాద్, గోపాల్ దిన్నె, పెద్దదిన్నె, బట్లదిన్నె, మునగాల, నక్కలపల్లి, కోదండపురం, కొండేరు, జింకలపల్లి, శివనంపల్లి, షేక్ పల్లి, సాసనూలు, బి. వీరాపురం తోపాటు ఆయా గ్రామాలలో రెండు రోజులపాటు కురుస్తున్న భారీ వర్షాలకు సోమవారం వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. వర్షాల కారణంగా ఇతర గ్రామాలకు వెళ్లే ప్రధాన రహదారులు, వాగులు, వంకలు జలమయం అయిపోయాయి. ఈ సందర్భంగా వాహనదారులు, ప్రయాణికులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కున్నారు. అలాగే ఆర్. గార్లపాడు గ్రామం నుండి ఎర్రవల్లికి వెళ్లే ప్రధాన మార్గాన ఉన్న వంతెన నిర్మాణం పనులు పూర్తిగా చేపట్టకపోవడంతో వాగుకు భారీగా వరద నీరు చేరి గ్రామాల మీదుగా ఎర్రవల్లి, గద్వాల తదితర ప్రాంతాలకు వెళ్లే వాహనాలు ధర్మంవరం స్టేజి మార్గాన వెళుతున్నారు. గతంలో ఉన్న వంతెనను తీసివేసి నూతన బ్రిడ్జి నిర్మాణం పనులు చేపట్టాలని ఉద్దేశంతో ఆర్ అండ్ బి అధికారులు నాలుగు సంవత్సరాల క్రితం టెండర్లు ప్రకటించారు. టెండర్ దక్కించుకున్న గుత్తేదారుడు నిర్లక్ష్యం కారణంగా నత్తనడకన పనులు కొనసాగిస్తున్నారు. వర్షాలు కురిస్తే పంట పొలాలకు, ఇతర గ్రామాలకు వెళ్లే రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదురుకోవాల్సిన దుస్థితి ఏర్పడిందని ఆయా గ్రామాల ప్రజలు వాపోయారు. ప్రతి సంవత్సరం వర్షాకాలంలో ఎర్రవల్లి నుండి ప్రాగటూరు వరకు వెళ్లే ప్రధాన రహదారి కావడంతో తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు వివిధ గ్రామాల ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో గ్రామస్తులు అందరు కలిసి స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ వి.ఎం అబ్రహం, ఆర్ఎంబి ఉన్నంత అధికారుల దృష్టికి పలుమార్లు తీసుకెళ్లిన పరిష్కరించలేదని వారు విమర్శిస్తున్నారు. ఇప్పటికైనా ప్రజల కష్టాలను గుర్తించి ఆర్. గార్లపాడు, సాసనూలు, షేక్ పల్లి, వంతెన నిర్మాణ పనులను త్వరగా చేపట్టి రాకపోకలకు అంతరాయం లేకుండా చూడాలని రైతులు, వాహనదారులు, ప్రయాణికులు కోరుతున్నారు.