భారీ వర్షాలతో నదులకు జీవం

మంజీరకు నీటి రాకతో జలకళ
సంగారెడ్డి,ఆగస్ట్‌5(జ‌నంసాక్షి): దేశవ్యాప్తంగా నదులు ఉప్పొంగుతున్నాయి. వరదుల ముంచెత్తుతున్నాయి. జీవనది మంజీర కూడా ఈ ఏడాది జలకళను సంతరించుకుంది. ఎగువన కర్నాటక తీరంలో వర్షాలు కురియకడంతో మంజీరకు నీటి రాక పెరిగింది. నదిలోకి నీరు రావడంతో జిల్లావాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలోని ఆయా ప్రాంతాల్లోని ప్రాజెక్టుల్లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతున్నది. ఓ వైపు గోదావరి,మరోవైపు కృష్ణానదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. కర్ణాటక రాష్ట్రంలో పుట్టి ప్రవహించే మంజీరా నది జిల్లాలోని నాగల్‌గిద్ద మండలం గౌడ్‌గాంజన్‌వాడ వద్ద ప్రవేశిస్తుంది. కర్ణాటకలో కురిసిన వర్షం వల్ల మంజీరాకు ఎగువన బీదర్‌ జిల్లా హుమ్నాబాద్‌ ప్రాంతంలో ఉన్న కరంజా ప్రాజెక్టులోకి నీరు వచ్చి చేరింది. ఈ ప్రాజెక్టు నుండి నీటిని కిందకు వదలడతో కరంజా ప్రాజెక్టులోకి భారీగా వరదలు వచ్చి చేరాయి. మంజీరాపై ఆధారపడి నారాయణఖేడ్‌తోపాటు జహీరాబాద్‌, అందోల్‌ నియోజకవర్గాల నీటి పథకాలు పని చేస్తున్నాయి. ఇప్పుడు వందల గ్రామాల్లో తాగునీటి సమస్యతీరింది. వందల గ్రామాలకు దీనిద్వారానే తాగునీరు సరఫరా అవుతుంది. ఈ నీటి పథకాల ఇన్‌టెక్‌ వెల్‌లు అన్నీ మంజీర నదిపైనే ఉన్నాయి. మంజీరకు జలకళతో రానున్న రోజుల్లో తాగునీట,సాగునీటి సమస్యలు ఉత్పన్నం కావు.