భారీ వర్షాలతో వంశధార, నాగావళికి వరద ఉధృతి
గొట్టా బ్యారేజీ 22 గేట్లు ఎత్తివేత
శ్రీకాకుళం,జూలై17(జనం సాక్షి): ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో వంశధార, నాగావళికి వరద ఉధృతి అధికంగా ఉంది. వరద ఉధృతితో అధికారులు గొట్టా బ్యారేజీ 22 గేట్లు ఎత్తివేశారు. ప్రస్తుత ఇన్ ప్లో, ఔట్‌ఎ/-లో 13వేల క్యూసెక్కులుగా ఉంది. అలాగే నాగావళి ఇన్‌ప్లో 15వేలు, ఔట్‌ప్లో 15వేల క్యూసెక్కులుగా నమోదు అయ్యింది. మరోవైపు వరద ఉధృతితో తోటపల్లి, మడ్డువలస రిజర్వాయర్‌ల గేట్లను అధికారులు ఎత్తివేశారు. దిగువ ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. జిల్లా, మండల కేంద్రాల్లో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేశారు. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. ఇదిలావుంటే నాగావళి నదిలో ఒక్కసారి వరద ఉద్ధృతి పెరగడంతో ఎచ్చెర్ల మండలం పొన్నాడ వద్ద నాగావళి నదిలో ఉన్న లంకలో సోమవారం మధ్యాహ్నం ముగ్గురు పశువులు కాపర్లు చిక్కుకుపోయారు. పాతపొన్నాడకు చెందిన గంగు ఎర్రంనాయుడు, లకిలీ దుర్గారావు, పొన్నాడకు చెందిన గొలివి కోటినాయుడు చిక్కుకున్నవారిలో ఉన్నారు. పశువులను మేపేందుకు ఉదయం లంకలోకి వెళ్లిన వారు సాయంత్రానికి రాకపోవటంతో స్థానికులు అధికారులకు సమాచారం అందించారు. దీంతో జడ్పీ అధ్యక్షురాలు చౌదరి ధనలక్ష్మి, తహసీల్దార్ కిమిడి రాంమ్మోహన్‌రావు, ఎస్సై వై.కృష్ణ అగ్నిమాపక సిబ్బందితో పొన్నాడ వద్ద నాగవళి నది ఒడ్డుకు చేరుకున్నారు. అగ్నిమాపక సిబ్బంది బోటు, రక్షణ పరికరాలతో బయలుదేరి లంక వద్దకు చేరుకుని లంకలో ఉండిపోయిన ముగ్గురిని సురక్షితంగా తీరానికి చేర్చారు. వరద ఉద్ధృతి క్రమక్రమంగా పెరగడంతో పశువుల కాపరులను తెచ్చేందుకు వెళ్లిన బృందం తిరిగి వచ్చేంత వరకూ తీరంలో ఉన్న అధికారులు , ప్రజల్లో ఉత్కంఠ నెలకొంది. ముగ్గురిని సురిక్షితంగా ఒడ్డుకు చేర్చడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.