భారీ విద్యుత్ ఉత్పాదనకు సింగరేణి భవిష్యత్తు ప్రణాళికలు

 

 

 

 

 

 

 

మొత్తం 3,350 మెగావాట్ల విద్యుత్తు దిశగా సింగరేణి భారీ వ్యూహం…….
సింగరేణి థర్మల్, సోలార్ విద్యుత్ విభాగంతో ఛైర్మన్ అండ్ ఎం.డి. సుదీర్ఘ సమావేశం…….
నెలలోగా ప్రతిపాదనలకు ఆదేశం
ప్రస్తుత 2 వేల మెగావాట్ల థర్మల్కు అదనంగా మరో 800 మెగావాట్ల ప్లాంటు——–
ప్రస్తుతం 300 మెగావాట్ల సోలార్కు అదనంగా మరో 250 మెగావాట్ల ప్లాంట్ల
ఏర్పాటుకు ప్రతిపాదనలు———-
వ్యాపార విస్తరణ సింగరేణి ఆర్థిక పరిపుష్టికి విద్యుత్ విస్తరణ —–=
ఛైర్మన్ మరియు ఎండి. ఎన్. శ్రీధర్……..
———————————————
సింగరేణి సంస్థ తన వ్యాపార విస్తరణ చర్యల్లో భాగంగా ప్రస్తుత థర్మల్ విద్యుత్, సోలార్ విద్యుత్ ప్లాంట్లకు అదనంగా మరో 1,050 మెగావాట్ల సామర్థ్యం గల ప్లాంట్లను ఏర్పాటు చేసి మొత్తం మీద 3,350 మెగావాట్ల విద్యుత్ ఉత్పాదన సామర్థ్యానికి చేరుకోవాలని భారీ వ్యూహానికి శ్రీకారం చుట్టింది.
హైదరాబాద్ సింగరేణి భవన్లో బుధవారం నాడు సంస్థ ఛైర్మన్,ఎండి ఎన్. శ్రీధర్ సింగరేణి థర్మల్, సోలార్ విద్యుత్ విభాగాల ఉన్నతాధికారులతో ఒక సుదీర్ఘ సమీక్ష సమావేశాన్ని నిర్వహించి,
ఈ మేరకు చర్చించారు. నెలరోజులలోగా కొత్త ప్లాంట్ల ఏర్పాటుకుసంబంధించిన ప్రణాళికలు రూపొందించి సమర్పించాలని అధికారులను ఆదేశించారు.
ఈ సమావేశంలో సంస్థ ఛైర్మన్,ఎం డి ఎన్. శ్రీధర్ మాట్లాడుతూ కంపెనీ నిర్వహిస్తున్న థర్మల్ సోలార్ విద్యుత్తు విభాగాల్లో సాధ్యమైన మేర సామర్ధ్యాలను పెంచి, భారీ ఉత్పత్తికి పూనుకోవాలని తద్వారా సంస్థకు గట్టి ఆర్థిక పునాది మంచి భవిష్యత్తు ఉంటుందని అధికారులకు సూచించారు.
2,800 మెగావాట్ల స్థాయికి థర్మల్ విద్యుత్
ప్రస్తుతం మంచిర్యాల జిల్లా జైపూర్ వద్ద సుమారు 2 వేల ఎకరాలలో స్థాపించిన 1,200 మెగావాట్ల థర్మల్ విద్యుత్ కేంద్ర ప్రాంగణంలో మరో 800 మెగావాట్ల సూపర్ క్రిటికల్ థర్మల్ పవర్ ప్లాంట్ ఏర్పాటుకు ఇటీవల రాష్ట్ర ప్రభుత్వ ఆదేశంతో సింగరేణి బోర్డులో కూడా ఆమోదం పొందడం జరిగింది. ఈ ప్లాంట్ నిర్మాణానికి టెండర్ ప్రక్రియ దాదాపు పూర్తయింది. వచ్చే నెల నుండి నిర్మాణం ప్రారంభం కాబోతోంది. ఈ ప్లాంట్ పూర్తయితే సింగరేణి థర్మల్ విద్యుత్ 2 వేల మెగావాట్లకు చేరుకుంటుంది. కాగా, దీనికి అదనంగా అదే ప్రాంతంలో మరో 800 మెగావాట్ల సూపర్ క్రిటికల్ పవర్ ప్లాంట్ ఏర్పాటు గల అవకాశాలను క్షుణంగా పరిశీలన చేసి నివేదించాలని సంస్థ ఛైర్మన్ ఆదేశించారు. ఈమేరకు అధికారులు బుధవారం నాడు సమావేశంలో ఈ ప్లాంట్ ఏర్పాటుకు గల సానుకూల అంశాలను వివరించారు.
ఈ ప్లాంటుకు కావలసిన 120 ఎకరాల స్థలంతో పాటు నీరు, రైలు మార్గం వంటి అన్ని వసతులు ప్రస్తుత ప్రాంగణంలో అందుబాటులోఉన్నందున మరో ఎనిమిది వందల మెగావాట్ల ప్లాంటును నిర్మించడానికి పూర్తి అవకాశాలు ఉన్నాయని కనుక దీనిపై డీపీఆర్ ప్రతిపాదన సమర్పించాలని అధికారులను ఆదేశించారు. ఈ ప్రతిపాదన ఆమోదంతో సింగరేణి థర్మల్ విద్యుత్తు ఉత్పాదన మొత్తం 2,800 మెగావాట్ల సామర్థ్యానికి చేరుకుంటుంది.
సింగరేణి ప్రస్తుతం నిర్వహిస్తున్న 1,200 మెగావాట్ల థర్మల్ విద్యుత్ కేంద్రం ఏటా సుమారు 500 కోట్ల రూపాయల ఆదాయాన్ని సింగరేణి సంస్థకు సమకూరుస్తూ సంస్థ ప్రగతికి దోహదపడుతోంది. కనుక కొత్తగా నిర్మించనున్న1,600 మెగావాట్ల ప్లాంట్లు కూడా సింగరేణికి మరింత ఆదాయం కలిగిస్తాయని కంపెనీ భావిస్తుంది.
మరో 250 మెగావాట్లతో మొత్తం 550 మెగావాట్ల స్థాయికి సోలార్ ప్లాంట్లు
ఇదిలా ఉంటే సింగరేణి సంస్థ ప్రస్తుతం 300 మెగావాట్ల సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేసే దిశగా ఇప్పటికే 224 మెగావాట్ల ప్లాంట్లను ఏర్పాటు చేసి విద్యుత్తును కూడా ఉత్పత్తి చేస్తుంది. మరో రెండు నెలల్లో మిగిలిన 76 మెగావాట్ల ప్లాంట్లను పూర్తి చేసి మొత్తం 300 మెగావాట్ల మొదటి దశ నిర్మాణాలను పూర్తి చేసుకోనుంది. ఈ ప్లాంట్లన్నీ సింగరేణి ఖాళీ స్థలాల్లోన్నే ఏర్పాటు చేశారు.
ఈ ప్లాంట్ల వల్ల సింగరేణి సంస్థ ప్రతి ఏటా తాను వినియోగించే 700 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఖర్చులు భారీగా తగ్గించుకోనుంది.
ఈ నేపథ్యంలో ఇంకా మిగిలి ఉన్న ఖాళీ స్థలాల్లో మరో 250 మెగావాట్ల సోలార్ ప్లాంట్లను ఏర్పాటు చేయాలని సంస్థ ఛైర్మన్ ఆదేశించారు. ఇటీవల తన భూపాలపల్లి ఏరియా పర్యటనలో స్వయంగా స్థలాలను పరిశీలించారు. సంబంధిత అధికారులు ఇతర ఏరియాల్లో స్థలాల కోసం తమ పరిశీలన పూర్తి చేశారు. భూపాలపల్లి, మందమర్రి, మణుగూరు వంటి ఏరియాలో ఉన్న ఖాళీ ప్రదేశాల్లో ఈ 250 మెగావాట్ల ప్లాంట్లను ఏర్పాటు చేయడంపై సమగ్ర నివేదికను నెలరోజుల్లోగా సమర్పించాలని సంస్థ ఛైర్మన్ బుధవారం నాటి సమావేశంలో సోలార్ అధికారులను ఆదేశించారు. ఇప్పటికే ఈ సోలార్ ప్లాంట్లను ఏర్పాటు చేయటానికి రాష్ట్ర ఇంధన శాఖకు సింగరేణి సంస్థ ప్రతిపాదన సమర్పించింది. కనుక రానున్న కాలంలోని సింగరేణి సంస్థ మరో 250 మెగావాట్ల సోలార్ విద్యుత్తు ఉత్పత్తికి చేరనుందని అధికారులు భావిస్తున్నారు. దీంతో సింగరేణి సంస్థ ఉత్పత్తి చేసే సోలార్ విద్యుత్తు 550 మెగావాట్లకు చేరుకుంటుంది. ఈవిధంగా సింగరేణి కాలరీస్ అనతి కాలంలోనే 2,800 మెగావాట్ల థర్మల్ విద్యుత్తు, 550 మెగావాట్ల సోలార్ విద్యుత్ వెరసి మొత్తం మీద 3,350 మెగావాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేసేందుకు ప్రణాళికాబద్ధంగా సంసిద్ధమవుతోంది.
బుధవారంనాడు జరిగిన సమావేశంలో డైరెక్టర్ (ఈ అండ్ ఎం) డి. సత్యనారాయణ రావు, చీఫ్ టెక్నికల్ కన్సల్టెంట్ సంజయ్ కుమార్ సూర్, (చీఫ్ ఆఫ్ ఆపరేషన్ అండ్ మెయిన్టెనెన్స్) జె.ఎన్. సింగ్, జనరల్ మేనేజర్ సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్ డి.వి.ఎస్.ఎన్. రాజు, జనరల్ మేనేజర్ (పర్చేజ్) వై. రాజశేఖర్ రెడ్డి, (చీఫ్ ఆఫ్ పవర్) ఎన్.వి.కె.వి. రాజు, జనరల్ మేనేజర్ (సివిల్)
రమేష్ బాబు తదితరులు పాల్గొన్నారు