భారీ స్కోర్ దిశగా టీమిండియా.. 302/4

kohli12అంటిగ్వా: విండీస్‌ పర్యటనను టీమ్‌ ఇండియా ధాటిగా ఆరంభించింది. తొలిటెస్టు తొలిరోజు స్పష్టమైన ఆధిక్యాన్ని ప్రదర్శించి భారీ స్కోరు దిశగా పయనిస్తోంది. కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి (143 నాటౌట్‌) శతకంతో చెలరేగడంతో తొలిరోజు ఆటముగిసే సమయానికి భారత్‌ 302/4తో పటిష్ఠ స్థితిలో నిలిచింది. కోహ్లికి తోడుగా అశ్విన్‌(22) క్రీజులో ఉన్నారు. తొలుత టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ ఆదిలోనే ఓపెనర్‌ విజయ్‌(7) వికెట్‌ కోల్పోయింది. అనంతరం పుజారా(16) తక్కువ స్కోరుకే వెనుదిరగడంతో భారత్‌ తడబడింది. అయితే ఈ దశలో ఓపెనర్‌ ధావన్‌(84)కు జత కలిసిన కోహ్లి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు.
నిలిచిన ధావన్‌-కోహ్లి
బౌలర్లకు సహకరిస్తున్న పిచ్‌పై విండీస్‌ పేస్‌ బౌలర్లు గాబ్రియల్‌, హోల్డర్‌ షార్ట్‌ పిచ్‌ బంతులతో భారత బ్యాట్స్‌మెన్స్‌ను ఇబ్బంది పెట్టారు. దీంతో పరుగులు సాధించేందుకు శ్రమించాల్సివచ్చింది. అయితే విరాట్‌ రాకతో ఇన్నింగ్స్‌కు వూపొచ్చింది. స్ట్రైక్‌ రొటేట్‌ చేయడంతో స్కోరు వేగం పెరిగింది.
కోహ్లి క్లాస్‌ ఇన్నింగ్స్‌
ఐపీఎల్‌లో వరుస శతకాలతో క్రికెట్‌ అభిమానులను అలరించిన కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి టెస్టుల్లోనూ తన జోరు కొనసాగించాడు. కెరీర్‌లో తన 12వ శతకాన్ని సాధించాడు. 197 బంతుల్లో 143 పరుగులు సాధించి నాటౌట్‌గా నిలిచాడు. మరోవైపు టెస్టుల్లో 3000 పరుగుల మైలురాయిని అందుకున్నాడు. జట్టు స్కోరు 74/2 ఉన్నప్పుడు క్రీజులోకి వచ్చిన కోహ్లి .. ధావన్‌తో కలసి ఇన్నింగ్స్‌ చక్కదిద్దాడు. వీరిద్దరూ మూడో వికెట్‌ 105 పరుగుల విలువైన భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.