భావనపాడు పోర్టును బలవంతంగా నిర్మించలేరు

రైతులకు న్యాయం చేయకుండా ఎలా చేపడతారు

వ్యవసాయకార్మిక సంఘం నేతల విమర్శలు

శ్రీకాకుళం,జనవరి18(జ‌నంసాక్షి): నిర్బంధంతో భావనపాడు పోర్టును నిర్మించలేరని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి. వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. 2013 భూ సేకరణ చట్టాన్ని పక్కన పెట్టి రైతుల నుండి భూములను బలవంతంగా లాక్కొని మత్స్యకారులను, కూలీలను రోడ్డున పడేసి పోర్టు నిర్మాణం చేయాలనుకుంటే… ప్రజలే తగిన బుద్ధి చెబుతారని వి.వెంకటేశ్వర్లు హెచ్చరించారు. శుక్రవారం ఉదయం వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి. వెంకటేశ్వర్లు మండల పరిధిలోని సెలగపేట, భావనపాడు గ్రామాలను సందర్శించారు. అక్కడి పోర్టు బాధిత ప్రజలతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ… పోర్టు నిర్మాణానికి ఎవరూ వ్యతిరేకం కాదని, 2013 భూ సేకరణ చట్టాన్ని ఉల్లంఘించి రైతులను, భూమి విూద ఆధారపడ్డ కూలీల సమస్యలను ఏమాత్రం పట్టించుకోకుండా, గ్రామ సభల ఆమోదం లేకుండా, సామాజిక ప్రభావం అంచనా వేయకుండా, బలవంతంగా భూములను లాక్కోవడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామాల్లోని ప్రజలను పోలీసుల చేత భయబ్రాంతులకు గురి చేయడం సబబు కాదన్నారు. పోర్టు బాధిత ప్రజలకు సరైన న్యాయం జరగలేదని అనిపిస్తే, అభ్యంతరాలను అధికారులకు ముందుగా తెలియజేయాలని సూచించారు. 2013 భూ సేకరణ చట్టం ప్రభుత్వం అమలు చేయకపోతే బాధిత ప్రజలకు కడవరకు అండగా ఉండి పోరాడుతామని, ఎవరికీ భయపడేది లేదని వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి అచ్చెన్నాయుడు బాధిత ప్రజలకు చట్టప్రకారం నష్టపరిహారం చెల్లించకుండా పోర్టు నిర్మాణానికి పూనుకోవడం సరికాదన్నారు. దౌర్జన్యంగా ప్రజల నుండి భూములను లాక్కోవడానికి ప్రయత్నిస్తే.. రానున్న ఎన్నికల్లో టిడిపి కి ప్రజలు బుద్ధి చెబుతారని చెప్పారు. మత్స్యకారులకు, వ్యవసాయ కార్మికులకు పూర్తి స్థాయి నష్టపరిహారం చెల్లించిన తరువాత పోర్టు నిర్మాణాన్ని చేపట్టాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు జి.సింహాచలం, వర్ల ప్రసాద్‌, జి.ఈశ్వరమ్మ, కె.ఎల్లయ్య, నంబూరి షణ్ముఖరావు, తదితరులు పాల్గొన్నారు.