భావితరాలకు ఎన్టీఆర్‌ చరిత్ర అవసరం

– నిమ్మకూరులో పర్యటించిన బాలయ్య, క్రిష్‌
– ఎన్టీఆర్‌ దంపతుల విగ్రహాలకు నివాళి
– అక్టోబర్‌, నవంబర్‌లో చిత్రీకరణ చేయబోతున్నాం – క్రిష్‌
విజయవాడ, ఆగస్టు4(జ‌నం సాక్షి) : భావితరాలు ఎన్టీఆర్‌ చరిత్రను తెలుసుకోవాల్సిన అవసరం ఉందని, ఈ చిత్రాన్ని అద్భుతంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని సినీ హీరో, ఎమ్మెల్యే బాలకృష్ణ, సినీ దర్శకుడు క్రిష్‌లు అన్నారు. ఎన్టీఆర్‌ బయోపిక్‌ చిత్ర బృందం శనివారం కృష్ణా జిల్లా నిమ్మకూరులో పర్యటించింది. స్వర్గీయ నందమూరి తారక రామారావు సొంతూరులో పర్యటిస్తూ.. ఆయన జీవిత విశేషాలను తెలుసుకుంటోంది. ఎన్టీఆర్‌ బాల్యం, హీరోగా మారడం.. తదితర విషయాలను ఎన్టీఆర్‌ బంధువులు, సన్నిహితులు చిత్రయూనిట్‌తో చర్చించారు. ఈ సందర్భంగా.. ఎన్టీఆర్‌ దంపతులు విగ్రహానికి బాలకృష్ణ, డైరెక్టర్‌ క్రిష్‌ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం గ్రామంలోని వేంకటేశ్వర స్వామి సన్నిధిలో ప్రత్యేక పూజలు చేశారు. నిమ్మకూరులో ఎన్టీఆర్‌ బయోపిక్‌ రెండో షెడ్యూల్‌ను చిత్రీకరించేందుకు చిత్ర యూనిట్‌ సన్నాహాలు చేస్తోంది. ఇందుకోసం లొకేషన్లను అన్వేషిస్తోంది. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ.. సినిమా షూటింగ్‌ శరవేగంగా జరుగుతోందని తెలిపారు. తండ్రి పాత్రలో తనయుడు నటిస్తుండటం ఇదే తొలిసారని అన్నారు. ఎన్టీఆర్‌ జన్మించిన నిమ్మకూరును పుణ్యక్షేత్రంగా బాలయ్య అభివర్ణించారు. తెలుగుదేశం పార్టీని ఏర్పాటు చేసి ఎన్నో పథకాలను ప్రవేశపెట్టిన ఎన్టీఆర్‌ జీవిత చరిత్రను భావితరాలకు తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ సినిమా తీస్తున్నానని బాలయ్య పేర్కొన్నారు. నిమ్మకూరు పర్యటన సందర్భంగా డైరెక్టర్‌ క్రిష్‌ విూడియాతో మాట్లాడారు. ‘ఈ సినిమాకు స్వర్గీయ ఎన్టీఆర్‌ కర్త, మేం కర్మ మాత్రమేనన్నారు. శుక్రవారం సీఎం చంద్రబాబును కలిశామని, చంద్రబాబు పాత్రలో నటిస్తోన్న రానా కూడా మాతోపాటు సీఎంను కలిశారన్నారు. ఆయనతో మేమంతా చాలా సేపు మాట్లాడామని, ఎన్టీఆర్‌ గురించి ఎన్నో కొత్త విషయాలు తెలుసుకుంటున్నామన్నారు. మాకు తెలిసింది ఒక్క శాతమేనని, ఇప్పుడు చాలా తెలుసుకుంటున్నామని క్రిష్‌ తెలిపారు. ఎన్టీఆర్‌ జీవిత చరిత్రను మూడు గంటల్లో చూపించడం కష్టమని, తెలుగువారి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటిన వ్యక్తి ఎన్టీఆర్‌ అన్నారు. అలాంటి వ్యక్తి కథను తెరకెక్కించే అవకాశం నాకు రావడం అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు. మాకు చాలా గొప్ప టీం లభించిందని క్రిష్‌ పేర్కొన్నారు. ఎన్టీఆర్‌ అభిమానులు, సినీ ప్రేక్షకులు అబ్బురపడేలా చిత్రాన్ని తీసేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు.

తాజావార్తలు