భూకబ్జాదారులపై చర్య తీసుకోవాలి

ఆక్రమణదారులపై కఠినంగా వ్యవహరించాలి

భూ సాధన కమిటీ జిల్లా కన్వీనర్‌ నారాయణ

కడప,నవంబర్‌23(జ‌నంసాక్షి): పేదల భూముల్ని కాజేయడానికి ప్రయత్నిస్తున్న కిషోర్‌ రెడ్డిపై, కత్తి చంద్ర పై కేసులు నమోదు చేయాలని భూ సాధన కమిటీ జిల్లా కన్వీనర్‌ నారాయణ పేర్కొన్నారు. నగరంలోని స్థానిక వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యాలయంలో నారాయణ శుక్రవారం విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఒంటిమిట్ట సిద్ధవటం మండల భూ సమస్యలపై పోలీసుల అతి చొరవను ఖండించారు. ఒంటిమిట్ట మండలం రాచ గుడిపల్లెలోని సర్వే నెంబర్‌ 388 లో ఒకటి నుంచి 13 వరకు గల సబ్‌ డివిజన్లలో 56.30 ఎకరాల ప్రభుత్వ భూమిని కొంత మంది స్వార్థపరులు తప్పుడు రికార్డులు సృష్టించి బినావిూల పేర్లతో ఆక్రమించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. దీనికి స్థానిక రెవెన్యూ పోలీసు సిబ్బంది వంతపాడుతున్నారన్నారు. ఏకంగా సిఐ రవికుమార్‌ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని నారాయణ విమర్శించారు. పేదలకు పంచాల్సిన భూములను పెద్దలకు కట్టబెట్టడం దుర్మార్గమన్నారు. అండగా నిలిచిన సిపిఎం నాయకులపై అక్రమ కేసులను బనాయించి వేధింపులకు గురిచేయడం సరికాదన్నారు. మండలంలో తొందరగా చలామణి అవుతున్న కిషోర్‌ నంద కిషోర్‌ రెడ్డి కొంతమంది బినావిూలను చేరదీసి సిపిఎం నాయకులపై అక్రమ కేసులను నమోదు చేయించడానికి కుట్రపన్నారని పేర్కొన్నారు. అధికారులు అక్రమార్కులు డివిజన్‌ల పంపిణీ చేసినట్లు చెబుతుండడం సిగ్గుచేటన్నారు. ఇదే భూమిలో గతంలో వాటర్‌ షెడ్‌ అభివృద్ధి కార్యక్రమాలు కూడా ప్రభుత్వ ఆధ్వర్యంలో చేపట్టారని నారాయణ గుర్తు చేశారు. ఇదే పద్ధతిలో సిద్ధవటం మండలంలోని భూ పోరాటం చేసిన పేదలపై, సిపిఎం నాయకులపై స్థానిక ఎస్‌ఐ బెదిరింపులకు దిగుతున్నారని చెప్పారు. పేదల భూములను

కాజేయడానికి ప్రయత్నిస్తున్న కిషోర్‌ రెడ్డిపై, కత్తి చంద్ర పై కేసులు నమోదు చేయాలని డిమాండ్‌ చేశారు. ఉన్నతాధికారులు దృష్టి సారించి చర్యలు తీసుకోవాలని, లేదంటే ఆందోళనను ఉధృతం చేస్తామని నారాయణ వ్యాఖ్యానించారు. ఈ సమావేశంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు వెంకటేష్‌, అన్వేష్‌, హేతువాద సంఘం జిల్లా కార్యదర్శి సిఆర్వి ప్రసాద్‌, కాంగ్రెస్‌ జిల్లా ఉపాధ్యక్షులు చంద్రశేఖర్‌, తదితరులు పాల్గొన్నారు.