భూసమస్యలకు ఇక చెక్‌

ఆధార్‌ తరహాలో భూదార్‌ కార్డులు

భూదార్‌తో దందాలకు అవకాశం లేదు

భూసేవల పోర్టల్‌ను ప్రాంభించిన సిఎం చంద్రబాబు

భార్య పేరువిూదున్న భూమిని కూడా కాజేయలేరన్న బాబు

అమరావతి,నవంబర్‌20(జ‌నంసాక్షి): భూసమస్యలను దూరం చేసేందుకే భూధార్‌ తీసుకురావడం ఒక చరిత్ర అని సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. మంగళవారం భూసేవ పోర్టల్‌ను చంద్రబాబు ప్రారంభించారు. అవినీతి రహిత పాలన అందించమే తన లక్ష్యమని బాబు స్పష్టం చేశారు. భూధార్‌ ద్వారా భూములు సురక్షితంగా ఉన్నాయా?, లేదా ఎప్పుడైనా చూసుకోవచ్చన్నారు. దీంతో భార్య పేరుతో ఉన్న భూమి కూడా భర్త దుర్వినియోగం చేయలేడన్నారు. ఆధార్‌ తరహాలో విూ భూముల వివరాలు అందుబాటులో ఉంటాయని సీఎం చెప్పారు. కాగా దేశంలోనే తొలిసారిగా ఏపీలో భూసేవ- భూధార్‌ ప్రాజెక్టును ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. చరిత్రలో భాగస్వాములైన ప్రతిఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ప్రతి భూమికి ఒక క్యూఆర్‌ కోడ్‌ ఉంటుందన్నారు. ప్రతి భూభాగం, స్థిరాస్తికి రాష్ట్ర వ్యాప్తంగా ‘భూధార్‌’ విశిష్ట సంఖ్య (11 అంకెలతో) అందించే కార్యక్రమాన్నిఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు లాంఛనంగా ప్రారంభించారు. ఉండవల్లిలోని ప్రజావేదిక వద్ద దీనికి సంబంధించిన ‘భూసేవ’ పోర్టల్‌ను సీఎం ప్రారంభించారు. ఆధార్‌ మాదిరిగానే భూధార్‌లో భూమి వివరాలన్నీ సమగ్రంగా ఉంటాయని చంద్రబాబు చెప్పారు. భూధార్‌ కోసం తొలిసారిగా అత్యాధునిక సాంకేతికతను వినియోగించామన్నారు. భూములు సురక్షితంగా ఉన్నాయా లేదా అనే విషయాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చన్నారు. దీంతో భార్య పేరు విూద ఉన్న భూమిని ఆమె భర్త సైతం కొట్టేయడానికి వీల్లేదని సీఎం వ్యాఖ్యానించారు. ఫోర్జరీ చేయడానికి కూడా వీల్లేని విధంగా కొత్త విధానాన్ని తీసుకొచ్చినట్లు వివరించారు. ప్రతి భూమికీ క్యూఆర్‌ కోడ్‌ ఉంటుందని.. అన్ని శాఖల కంటే రెవెన్యూ శాఖకు మంచి పేరు రాబోతోందని ఆయన చెప్పారు. భూధార్‌ తీసుకురావడం ఒక చరిత్రని.. దీనిలో భాగస్వాములైన అధికారులందరికీ చంద్రబాబు కృతజ్ఞతలు తెలిపారు. వేలిముద్రలు, కనుపాపల ఆధారంగా మనుషులకు ఆధార్‌ ఇచ్చినట్లే.. భూములు, ఆస్తుల గుర్తింపునకు సర్వేనెంబర్లు, సబ్‌డివిజన్ల ఆధారంగా అక్షాంశ, రేఖాంశాలతో భూధార్‌ ఇవ్వనున్నారు. రాష్ట్రంలోని 2.84 కోట్ల వ్యవసాయ భూములు, 0.32 కోట్ల పట్టణ ఆస్తులు, 0.84 కోట్ల గ్రావిూణ ఆస్తులకు భూధార్‌ కేటాయిస్తున్నారు. రెవెన్యూ, సర్వే, రిజిస్టేట్రషన్‌ , పంచాయతీ, పురపాలక, అటవీ శాఖలు ఈ ప్రాజెక్టులో భాగం పంచుకుంటాయి. ఈ పథకాన్ని ప్రయోగాత్మకంగా కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలంలో ఈ ఏడాది ఏప్రిల్‌ 11న ప్రారంభించారు. అక్కడ విజయవంతం కావడంతో రాష్ట్ర వ్యాప్తంగా అమల్లోకి తీసుకొచ్చారు. ఈ కార్యక్రమంలో మంత్రులు,అధికారులు పాల్గొన్నారు.