భైంసాలో ఆర్థరాత్రి కత్తి పోట్ల కలకలం
నిర్మల్ జిల్లా బైంసా పట్టణంలో బుధవారం అర్ధరాత్రి వేళలో చోటు చేసుకున్న కత్తి పోట్ల ఘటన కలకలం రేపింది. పట్టణంలోని గోపాల్ నగర్ కాలనీకి చెందిన తోట శంకర్ (30) అనే యువకునిపై అర్ధరాత్రి వేళలో గుర్తు తెలియని వ్యక్తి ఒకరు కత్తితో దాడికి పాల్పడ్డాడు. అర్ధరాత్రి వేళలో సదరు వ్యక్తి బైక్ పై గోపాల్ నగర్ కాలనీకు వచ్చి తోట శంకర్ ను బయ టకు పిలిచినట్లుగా సమాచారం. నిద్ర నుంచి మెల్కొని ఇంటి తలుపు తీసుకొని బయటకు వచ్చిన యువకునిపై సదరు వ్యక్తి కత్తితో విచక్షణరహితంగా దాడికి పాల్పడ్డట్లుగా తెలిసింది. బాదితుడు అరుపులు కేకలు వేయడంతో సమీప నివాస గృహాల వారు యువకుని ఇంటి వద్దకు పరుగున వచ్చారు. దీంతో దాడికి సదరు వ్యక్తి తాను తీసుకవచ్చిన బైక్ ను అక్కడే వదిలి పారిపోయినట్లుగా సమాచారం. కత్తిపోట్ల బారిన పడి తీవ్ర గాయాలపాలైన తోట శంకర్ ను కాలనీకి చెందిన కొందరు యువకులు హుటహూటిన స్థానిక ఏరియా అసుపత్రికి తరలించి ప్రథమ చికిత్స నిర్వహించి మెరుగైన వైద్య సేవల కోసం గాను నిజామాబాద్ ఆసుపత్రి కి తరలించినట్లుగా తెలిసింది. సంబంధిత సమాచారం అందుకున్న పట్టణ పోలీసులు ఘటన స్థలికి వెళ్లి అక్కడ దాడికి పాల్పడ్డ వ్యక్తి వదిలిపెట్టిన బైకు ను స్వాధీన పరచుకొని నిందితుడిని గుర్తించే చర్యలకు ఉపక్రమించారు.