భోజనంలో విషం కలిపిన బాలిక!

– వంటమనిషి గుర్తించడంతో తప్పిన ముప్పు
గోరఖ్‌పూర్‌, జులై18(జ‌నం సాక్షి) : ఓ ప్రాథమిక పాఠశాలలో ఏడో తరగతి విద్యార్థిని మధ్యాహ్న భోజనంలో విషం కలిపిన ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లో చోటు చేసుకుంది. విద్యార్థులకు భోజనం వడ్డించకముందే ఈ విషయాన్ని గుర్తించిన వంటమనిషి పాఠశాల యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లగా, వారు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆహార, ఔషధ పరిపాలనా శాఖ (ఎఫ్‌డీఏ) అధికారులతో పాటు పోలీసులు ఆ పాఠశాలకు చేరుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ చర్యకు పాల్పడిన ఆ బాలికతో పాటు ఆమె తల్లిని ప్రశ్నించారు. అయితే, తాను విషం కలిపినట్లు ఆ బాలిక ఒప్పుకోలేదు. ఈ ఏడాది ఏప్రిల్‌లో ఆ బాలిక తమ్ముడిని ఐదో తరగతి విద్యార్థి ఒకరు ఇటుక రాయితో కొట్టి హత్య చేశాడు. అప్పట్నుంచి ఆమె పాఠశాలపై పగ పెంచుకుని ఈ దారుణానికి పాల్పడడానికి ప్రయత్నించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ భోజన శాంపిళ్లను సేకరించిన అధికారులు వాటిని పరీక్షించడానికి తీసుకెళ్లారు. ఈ ఘటనపై బంకాటి పోలీస్‌ స్టేషన్‌ ఎస్‌హెచ్‌వో దేవేంద్ర సింగ్‌ విూడియాతో ట్లాడుతూ… ఎఫ్‌డీఏ అందించే నివేదికలో ఆ ఆహారంలో విషం ఉందని తేలితే తాము తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపారు.