భౌతిక శాస్త్రంలో ముగ్గురికి నోబెల్ బహుమతులు
స్టాక్¬మ్,అక్టోబర్ 3(జనంసాక్షి): భౌతికశాస్త్రంలో ఈసారి నోబెల్ బహుమతి ముగ్గురు శాస్త్రవేత్తలను వరించింది. పదార్థానికి సంబంధించిన అసాధారణ దశలను వెలికి తీయడంలో చేసిన అధ్యయనానికి గాను డేవిడ్ జె.థౌలెస్, డంకన్ ఎం.హాల్దనె, మైకేల్ కోస్టెర్లిట్జ్‌లకు నోబెల్ అవార్డు ప్రకటించారు. ప్రైజ్‌మనీలో సగం డేవిడ్ జె.థౌలెస్‌కు, మిగతా సగం డంకన్, మైకేల్‌లకు అందజేయనున్నారు. స్టాక్¬మ్‌లోని రాయల్ స్వీడిష్ అకాడవిూ ఆఫ్ సైన్సెస్ భౌతిక శాస్త్రంలో నోబెల్ అవార్డును ప్రకటించింది. పదర్థానికి సంబంధించినంత వరకు ఓ కొత్త ప్రపంచాన్ని ఈ శాస్త్రవేత్తలు ఆవిష్కరించారని ఈ సందర్భంగా ఎంపిక కమిటీ ప్రకటించింది. అత్యాధునిక గణితశాస్త్ర పద్ధతులు ఉపయోగించి పదార్థానికి చెందిన సూపర్ కండక్టర్స్, సూపర్ ఫ్లూయిడ్స్‌లాంటి అసాధారణ దశలపై అధ్యయనం చేశారని కమిటీ తెలిపింది. పదార్థానికి సంబంధించిన ఎన్నో కొత్త విషయాలను వీళ్ల ఆవిష్కరణ బయటపెట్టిందని అభిప్రాయపడింది. థౌలెస్ యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్ లో ప్రొఫెసర్ కాగా.. హల్డానె న్యూజెర్సీలోని ప్రిన్స్‌టన్ యూనివర్సిటీలో ఫిజిక్స్ ప్రొఫెసర్. ఇక కోస్టెర్ లిట్జ్ రోడ్ ఐలాండ్ బ్రౌన్ యూనివర్సిటీలో ఫిజిక్స్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. నిజానికి వీరు 1970, 80లలో ఈ పరిశోధన చేశారు. వాళ్ల ఆవిష్కరణలు కాలం విసిరే సవాళ్లను తట్టుకొని నిలబడ్డాయా లేదా అన్న విషయం నిర్దారించుకునేందుకు దశాబ్దాల తర్వాత కూడా ఇలాంటి పరిశోధనలకు నోబెల్ కమిటీ అవార్డు అందజేస్తుంది. ఈ ఏడాది నోబెల్ బహుమతులను సోమవారం నుంచి ప్రకటిస్తున్నారు. సోమవారం వైద్యరంగంలో ప్రకటించారు. ఇక బుధవారం రసాయన శాస్త్రం, శుక్రవారం శాంతి నోబెల్, వచ్చే వారం ఆర్థిక, సాహిత్య నోబెల్స్ ప్రకటిస్తారు. నోబెల్ బహుమతి కింద 9 లక్షల 30 వేల డాలర్లు ప్రైజ్ మనీ అందజేస్తారు. డిసెంబర్ 10న అన్ని రంగాల్లో నోబెల్ పొందిన వారికి అవార్డు ఇస్తారు.