మంచిని స్వాగతించలేని దీనస్థితిలో ప్రతిపక్షం
– అన్నా క్యాంటీన్లకు మంచి ఆదరణ
– సెప్టెంబర్ నాటికి 203 క్యాంటిన్‌లు ఏర్పాటు చేస్తాం
– మంత్రి నారాయణ
విజయవాడ, జులై27(జనంసాక్షి) : పేదవాళ్ల కడుపు నింపాలనే అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేశామని మంత్రి నారాయణ అన్నారు. శుక్రవారం గాంధీనగర్‌లో అన్న క్యాంటీన్‌ను మంత్రి నారాయణ, ఎమ్మెల్యే బోండా ఉమ, మేయర్ కోనేరు శ్రీధర్ పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అన్నా క్యాంటీన్లకు మంచి ఆదరణ లభిస్తుందన్నారు, నాణ్యమైన అల్పాహారం, భోజనాన్ని అందిస్తున్నామని, తద్వారా అన్నా క్యాంటీన్లకు మంచి ఆదరణ లభిస్తుందని మంత్రి తెలిపారు. సెప్టెంబరు చివరికల్లా 203 క్యాంటీన్‌లు ఏర్పాటు చేస్తామని తెలిపారు. మండల కేంద్రాల్లో కూడా అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యేలు కోరుతున్నారని, ఆ దిశగా చంద్రబాబు ఆలోచిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. అన్న క్యాంటీన్లు మొక్కుబడిగా కాకుండా ప్రత్యేకంగా ఉండాలనే చంద్రబాబు అన్ని హంగులతో డిజైన్ చేయించారని తెలిపారు. మంచిని స్వాగతించలేని దీనస్థితిలో ప్రతిపక్షం ఉందని మంత్రి నారాయణ విమర్శించారు. మంచి కార్యక్రమాలపైన ప్రతిపక్షాలు దుష్పచారం చేయడం సిగ్గు చేటన్నారు. ప్రతి విషయాన్ని రాజకీయంగా చూడటం వైసీపీ నేతలకు అలవాటుగా మారిందన్నారు. ఎవరెన్ని ఆరోపణలు చేసినా, అడ్డంకులు సృష్టించి
పేదల అభ్యున్నతికి తెదేపా కట్టుబడి పని చేస్తుందని మంత్రి స్పష్టం చేశారు.