మంచి చేద్దామంటే ఎవరూ ముందుకు రావట్లేదు
– జనసేన అధినేత పవన్ కళ్యాణ్
ఏలూరు, సెప్టెంబర్ 26(జనంసాక్షి) : రాజకీయాల్లోకి రాకముందు అందరూ నాతో ఉన్నారు.. కానీ రాజకీయాల్లోకి వచ్చి మంచి చేద్దామంటే నా పక్కన నడవడానికి, సహాయం చేయడానికి మాత్రం ముందుకు రావడం లేదు అని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అన్నారు. ఏలూరులోని క్రాంతి కళ్యాణ మండపంలో బుధవారం జూనియర్ డాక్టర్లతో పవన్ కళ్యాణ్ సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ… అందరూ నేను సినిమాల్లోకి వచ్చాక రాజకీయాల్లోకి వచ్చా అనుకుంటారు, కానీ నేను సినిమాల్లోకి రాకముందే రాజకీయాల్లోకి రావాలని నిర్ణయించుకున్నాని తెలిపారు. రీసెర్చ్ సెంటర్ కోసం నేను హార్వార్డ్ నుంచి వైద్య బృందాన్ని తీసుకొచ్చి స్కీన్రింగ్ చేయిస్తే.. ప్రభుత్వం మాత్రం ఎవరో ఆస్టేల్రియా యూనివర్సిటీ అని చెప్పి ఇప్పటికి చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు. విూరు చెప్పిన ప్రతి అంశాన్ని కూడా నేను పరిగణలోకి తీసుకుంటాను, కానీ ఇవ్వన్నీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటేనే చేయగలం అని అన్నారు. ఆరోగ్యశ్రీ వంటి సేవల వలన చాలా నిరూపయోగం జరుగుతుందనే విషయం చాలా కాలం క్రితమే నా దృష్టికి వచ్చిందని, వీటిలో జరిగే తప్పుఒప్పులను అధ్యయనం చేస్తామని పవన్ హావిూ ఇచ్చారు. ప్రస్తుతం రాజకీయాలు వ్యాపారంగా మారుతున్నాయని, కొంతమంది నేతలు తమ స్వార్థంప్రయోజనాల కోసం రాజకీయాలను వాడుకోవటం వల్ల యువత రాజకీయాల్లోకి రావాలంటే భయపడుతుందన్నారు. తాను యువతను, కొత్తవారిని, ప్రజలకు సేవచేసే తత్వం ఉన్నవారిని జనసేనలోకి ఆహ్వానిస్తున్నట్లు పవన్ తెలిపారు.