మంత్రివర్గం తరవాత స్పీకర్‌ ఎంపికపై ఆసక్తి

పదవి ఎవరిని వరిస్తుందో అన్న ఉత్కంఠ
రేసులో ముందున్న ఆనం, ధర్మాన?
అమరావతి,జూన్‌7(జ‌నంసాక్షి): మంత్రివర్గ విస్తరణకు ఏర్పాట్లు జరుగుతన్న వేళ తదుపరి స్పీకర్‌ ఎవరన్న చర్చ కూడా సాగుతోంది. అసెంబ్లీ నిర్వహణలో అనుభవజ్ఞులు అయిన నేతలు స్పీకర్‌గా ఉండాలి. అలాగే అలాంటి వారి కోసం జగన్‌ అన్వేషిస్తున్నట్లు సమాచారం. ఇందులో భాగంగా పార్టీలో కీలకంగా ఉంటూ అసెంబ్లీలో సీనియర్లుగా ఉన్న ఆనం రామనారయణరెడ్డి, ధర్మాన ప్రసాదరావుఅల పేర్లు ప్రముఖంగా
వినిపిస్తున్నాయి. 12 నుంచి అసెంబ్లీ సమావేశాలు జరుగనున్నాయి. 8న మంత్రివర్గ విస్తరణ జరుగనుంది. ఈ దశలో వీరిలో ఎవరికి మంత్రిపదవి దక్కకున్నా వారే స్పీకర్‌ కావడంలో ముందుంటారని అర్థం చేసుకోవచ్చు. స్పీకర్‌ పదవి నిర్వహించడం అంటే సమాన్య విషయం కాదు. అవగాహన, అనుభవం, అంతకు మించి హుందా తనం, శాంత స్వభావం కలిగిన నాయకులు అవసరం. ఆ కోణంలో చూస్తే సీఎం జగన్‌ టీంలో ఆనం రామనారాయణ రెడ్డి, ధర్మాప్రసాదరావులు ముందు వరుసలో కనిపిస్తారు. ఈ కారణాల దృష్ట్యా వీరిద్దరిలో ఎవరో ఒకరు స్పీకర్‌ అవుతారని, ఆనంకు ఆ విధంగా సముచిత స్థానం కల్పించను న్నారనే అంచనా వేస్తున్నారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన రోజు నుంచి ఉత్కంఠగా ఎదురుచూసిన రోజు రానే వచ్చింది. ఎన్నికల్లో ఘన విజయం సాధించిన ఎమ్మెల్యేల్లో అమాత్యయోగం ఎవరికి దక్కనుందో తేలిపోనుంది. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంప్‌ కార్యాలయంలో జరిగే వైసీపీ శాసనసభా పక్ష సమావేశంలో మంత్రుల పేర్లను పార్టీ అధినేత, సీఎం జగన్‌ ప్రకటిస్తారని సమాచారం. ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర ముఖ్య నాయకులు విజయవాడకు బయలుదేరి వెళ్లారు. తమ నాయకుల్లో నాయకుల్లో మంత్రి పదవులు ఎవరికి దక్కుతాయో తెలుసుకోవడానికి పెద్ద ఎత్తున వైసీపీ శ్రేణులు తాడేపల్లికి చేరుకున్నాయి. జగన్‌ కేబినెట్‌లో జిల్లా నుంచి చోటు దక్కించుకునే అదృష్టవంతులపై విస్తృత ప్రచారాలు ఊపందుకున్నాయి. సీనియర్‌ ఎమ్మెల్యే, ఇప్పటికే పలుసార్లు, పలు శాఖల మంత్రిగా చేసిన అనుభవం కలిగిన ఆనం రామనారాయణరెడ్డికి జగన్‌ సముచిత స్థానం కల్పిస్తారని తెలిసింది. అత్యంత గౌరవ ప్రదమైన శాసన సభాపతి  పదవికి ఆనం రామనారాయణరెడ్డిని ఎంపిక చేస్తారనే ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతోంది. కీలకమైన శాఖకు మంత్రిగా చేసిన అనుభవం ఉన్నా, అత్యంత కీలకమైన స్పీకర్‌ పదవికి సమర్థులైన వారు లేకపోవడంతో ఆనం రామనారాయణరెడ్డిని ఆ స్థానంలో కూర్చోబెట్టనున్నట్లు భావిస్తున్నారు. ఆయనతో పాటు ధర్మన పేరు కూడా వినవస్తోంది.