మంత్రి భర్త దోషి అని తేలితే వదిలేది లేదు

– బీహార్‌ సీఎం నితీష్‌కుమార్‌

పట్నా, ఆగస్టు6(జ‌నం సాక్షి ) : ముజఫర్‌పూర్‌ అత్యాచార కేసులో మంత్రి భర్త పాత్ర ఉందని రుజువైతే వదిలిపెట్టేది లేదని బిహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్‌ స్పష్టం చేశారు. ఈ కేసులో మంత్రి మంజు వర్మ భర్త పాత్ర ఉందని, ఆమెను వెంటనే మంత్రి పదవి నుంచి తప్పించాలని పలువురు డిమాండ్‌ చేయడంపై ఆయన స్పందించారు. సోమవారం ఏర్పాటు చేసిన విూడియా సమావేశంలో నితీశ్‌ ఈ విషయం గురించి మాట్లాడారు. మంత్రికి సంబంధించిన వ్యక్తులకు ఈ కేసుతో సంబంధం ఉంటే వాళ్లని వదిలిపెట్టేది లేదని నితీష్‌ స్పష్టం చేశారు. కానీ ఇప్పుడు ఈ విషయాన్ని ఎందుకు ఎక్కవ చేసి చూపిస్తున్నారని, మేం ఆమెను పిలిపించి మాట్లాడాం మన్నారు. ఈ కేసుతో తన భర్తకు ఎటువంటి సంబంధం లేదని చెప్పిందని, ఆధారాలు లేనప్పుడు మేం దీన్ని ఎలా సమర్థిస్తామని నితీశ్‌ ప్రశ్నించారు. ఈ కేసును ప్రస్తుతం సీబీఐ విచారిస్తుండగా.. హైకోర్టు పర్యవేక్షిస్తుందని ఆయన తెలిపారు. ముజఫర్‌పూర్‌ బాలికల వసతి గృహానికి మంత్రి మంజు వర్మ భర్త చందేశ్వర్‌ వర్మ తరచూ వస్తుండేవారని ఇటీవల వార్తలు వెలువడిన విషయం తెలిసిందే. ఈ వార్తలను మంత్రి మంజు తీవ్రంగా ఖండించారు. ఒకవేళ నిజంగానే తన భర్తకు ఈ కేసుతో సంబంధం ఉందని రుజువైతే.. తానే అతనికి బహిరంగా ఉరి వేస్తానని ఆమె తెలిపారు.