మట్టి గణపతులను స్వాగతిద్దాం
పర్యావరణహితం కోసం పనిచేద్దాం: కోడెల
గుంటూరు,సెప్టెంబర్3(జనం సాక్షి): పర్యావరణహితం కోరి మట్టి గణపతులతో వినాయకచవితి నిర్వహించాలని ఎపి శాసనసభాపతి డాక్టర్ కోడెల శివప్రసాదరావు ప్రజలకు పిలుపునిచ్చారు. స్వచ్ఛ భారత్, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ లక్ష్యాలకు అనుగుణంగా పర్యావరణహిత చవితిని రాష్ట్ర ప్రజలందరూ జరుపుకోవాలన్నారు. మట్టి ప్రతిమలు తయారుచేసి ఉచితంగా పంపిణీచేసే వారికి ప్రభుత్వం నుంచి ప్రోత్సాహకం ఉంటే మంచిదన్నారు. ఈ చవితి ప్రజల ఆలోచనా ధోరణిలో ఆశాజనకమైన మార్పును చూపించాలని తాను కోరుకుంటున్నట్లు సభాపతి చెప్పారు. స్వతహాగా వైద్యుడినైనా తాను ప్రజల ఆరోగ్యం బాగుండాలని కోరుకుంటానని రంగుల ప్రతిమలతో అనారోగ్యం బారినపడవద్దని ప్రజలకు సూచించారు. సహజసిద్ధమైన మట్టితో రూపొందించిన ప్రతిమలను ఏర్పాటుచేసి సాంప్రదాయబద్ధంగా పండుగ జరుపుకోవాలన్నారు. రంగులు విషతుల్య రసాయన పదార్థాలతో ఏర్పాటు చేసిన మట్టి ప్రతిమలు వాడి కోరి ప్రమాదాలు తెచ్చుకోవద్దన్నారు. ఈ వినాయకచవితిని ఎంతగా ఆనందం గా జరుపుకుంటామో పర్యావరణానికి మేలు చేద్దామన్న ప్రతినతో సాగాలని పిలుపునిచ్చారు. ఉత్సవ కమిటీలు పండుగకు వసూలుచేసే నగదులో కొంతైనా గ్రామాభివృద్ధికి వినియోగిస్తే ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. రసాయన పదార్థాలతో తయారు చేసిన విగ్రహాలతో గాలి, నీరు, నేల సమస్తం కాలుష్యం బారినపడుతున్నాయన్నారు. క్యాన్సర్, కిడ్నీలు, శ్వాసకోశ సంబంధ వ్యాధులు పెరిగేందుకు రంగుల విగ్రహాలే కారణమన్నారు. రసాయన పదార్థాలతో తయారుచేసిన విగ్రహాల్ని నీళ్ళల్లో నిమజ్జనంచేస్తే అందులో విషంచేరి నీటిలోని జీవరాశులు అంతరిస్తున్నాయన్నారు. తాను చవితి పండుగకు వ్యతిరేకం కాదని పర్యావరణహితంగా జరుపుకుంటేనే పండుగ సమాజానికి బాగుంటుందని చెప్పారు.