” మట్టి వినాయకులనే పూజిద్దాం – కొండాపూర్ డివిజన్ కార్పొరేటర్ హమీద్ పటేల్”
శేరిలింగంపల్లి, ఆగస్టు 30( జనంసాక్షి): మనసుంటే మార్గం ఉంటుందని, భక్తితో కొలిస్తే ఏ దేవుడైన కరుణిస్తాడని… రంగుల వినాయక ప్రతిమలకన్నా మట్టి గణేశుడు ఎంతో శ్రేష్టమని శేరిలింగంపల్లి నియోజకవర్గం కొండాపూర్ డివిజన్ కార్పొరేటర్ హమీద్ పటేల్ అన్నారు. ఈ మేరకు బుధవారం వినాయక చవితి మహా పర్వదినాన్ని పురస్కరించుకొని కొండాపూర్ లో తెరాస నాయకులు మంగళవారం ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానికులకు, తెరాస కార్యకర్తలకు ఆయన మట్టి గణేషులను ఉచితంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో మాట్లాడుతూ ప్లాస్టర్ ఆఫ్ పారిస్, వివిధ రసాయనాలతో తయారుచేసిన గణేష్ విగ్రహాల వల్ల పర్యావరణ ఇబ్బందులు తలెత్తుతున్నాయని, కావున ప్రతి ఒక్కరూ సహృదయంతో మట్టి గణేష్ ప్రతిమలను ప్రతిష్టించి పూజించాల్సిన అవసరం ఉందని కోరారు. సర్వవిజ్ఞాలకు ఆదిదేవుడైన గణేశుడని ప్రతి ఒక్కరూ భక్తిశ్రద్ధలతో పూజించి జీవితంలో ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలను సిద్ధింప చేసుకోవాలని హమీద్ పటేల్ పునరుద్ఘాటించారు. ఎంతో సహజసిద్ధమైన మట్టి వినాయక ప్రతిమల వల్ల భక్తి, ముక్తి, ఆహ్లాదం, ఆనందం కలిగి గణేష్ నవరాత్రులు మరింత శోభాయమానంగా జరుపుకునేందుకు అవకాశం కలుగుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. మట్టి గణేష్ ప్రతిమలను అందజేసినందుకు స్థానికులు హమీద్ పటేల్ కు కృతజ్ఞతలు తెలిపారు. వినాయక చవితి పండుగ చాలా ప్రత్యేకమైన పండుగ అని, పిల్లలకు పెద్దలకు కూడా చాలా ఇష్టమైన పండుగ వినాయక చవితి అని ఆయన వివరించారు. ఇందులో భాగంగా కొండాపూర్ డివిజన్ ప్రజలకు ఆయన వినాయక చవితి పర్వదిన ప్రత్యేక శుభకాంక్షలను తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ హమీద్ పటేల్ తోపాటు కొండాపూర్ డివిజన్ సెక్రటరీ బలరాం యాదవ్, శ్రీనివాస్ చౌదరి, కవిటి లక్ష్మి, తాడెం మహేందర్, తిరుపతి యాదవ్, డా మల్లేష్ యాదవ్, కృష్ణ సాగర్, శ్రీను, కాశెట్టి అంజి, డా రమేష్, మంగమ్మ, యాదగిరి, ఆంజనేయులు, వెంకట్ రెడ్డి, శివ కుమార్, వెంకట రమణ, కృష్ణ యాదవ్, ప్రసాద్, హనుమంత రెడ్డి, అవదీష్ నారాయణ, బంగారు రెడ్డి, శివ రెడ్డి, వెంకట రామయ్య, వివి రావు, రఫీ, సంతోష్, టీఅరెస్వి అభి, తదితరులు పాల్గొన్నారు.