మత్స్యకారులను పట్టించుకోని బాబు
రాజదాని పేరుతో ఇంకెన్నాళ్లు మోసం: ధర్మాన
శ్రీకాకుళం,జూలై18(జనం సాక్షి): రాజధాని నిర్మాణం పేరుతో పేదలనుంచి భూములు సేకరించి టీడీపీ నాయకులు రియల్‌ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటున్నారని వైసీపీ ప్రాంతీయ సమన్వయకర్త, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు విమర్శించారు. పోలవరంపై ఇంకా త్రీడీ సినిమా చూపిస్తున్నారని అన్నారు. ఏవిూ చేయకుండానే మరోమారు గెలిపించాలని అంటున్న చంద్రబాబు పాలనపై ప్రజలు ఆలోచన చేయాల న్నారు. అలాగే మత్స్యకారులను ఆదుకోవడంలో టీడీపీ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. మత్స్యకారులపై టీడీపీ వ్యవహరిస్తున్న తీరును నిరసిస్తూ శ్రీకాకుళం నియోజకవర్గం మత్స్యకార గ్రామాలైన నర్సయ్యపేట, పెద్దగనగళ్లవానిపేట, కుందువానిపేట, బలరాంపురం తదితర గ్రామాల్లో పాదయాత్ర చేసి పరిస్తితి తెలుసుకున్నాని అన్నారు.ప్రజాస్వామ్యంలో పదవులు శాశ్వతం కాదని, ప్రజల మనసెరిగి పాలించిన నాయకుడి వెంటే ప్రజలు ఉంటారన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు మాయమాటలతో మత్స్యకారులను నిలువునా ముంచేస్తున్నారని విమర్శించారు. జిల్లాలో సరైన అవకాశాలు లేక ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లి శ్రమదోపిడీకి గురై ప్రాణాలు కోల్పోయిన మత్స్యకారులకు అండగా నిలవడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. జిల్లాలో 150 మంది మత్స్యకారులు మరణిస్తే కనీసం వారికి ఒక్కపైసా కూడా ప్రభుత్వం సాయం అందించలేదని అన్నారు. రాష్ట్రంలో 5 లక్షల హుద్‌హుద్ ఇళ్లు నిర్మించి ఇస్తానని ప్రగల్భాలు పలికిన ముఖ్యమంత్రి మత్స్యకారులకు ఒక్క ఇల్లు కూడా ఇవ్వ లేదన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం టీడీపీ నాయకుల అక్రమాలవల్లే ఆలస్యమవుతోందన్నారు. సమస్యలను తెలిపేందుకు ముఖ్య మంత్రి వద్దకు మత్స్యకారులు వెళ్తే వారిని దుర్భాషలాడడం సరికాదన్నారు.
——————