మత్స్యరంగం అవకాశాలపై అవగాహన పెంచాలి
– పద్మశ్రీ డాక్టర్ విజయ్ గుప్తా
ప్రపంచవ్యాప్తంగా మత్స్యరంగంలో అందుబాటులోకి వస్తున్న ఆధునిక విధానాలపై సాంప్రదాయ మత్స్యకారుల్లో అవగాహన కల్పించేందుకు కృషి చేయవలసిన అవసరం ఉందని పద్మశ్రీ అవార్డు గ్రహీత, ప్రపంచ ప్రఖ్యాత మత్స్యరంగ నిపుణులు డాక్టర్ మోదడుగు విజయ్ గుప్తా అన్నారు. ఆదివారం మధ్యాహ్నం రెడ్ హిల్స్ లోని తెలంగాణ చాంబర్ ఆఫ్ కామర్స్ ఆడిటోరియంలో తెలంగాణ ఫిషరీస్ ఫెడరేషన్ మాజీ చైర్మన్ శ్రీ పిట్టల రవీందర్ అధ్యక్షతన జరిగిన తెలంగాణ ఫిషరీస్ సొసైటీ ఆవిర్భావ సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.
ఈ సందర్భంగా పద్మశ్రీ డాక్టర్ మోదడుగు విజయ్ గుప్తా మాట్లాడుతూ ఆధునిక శాస్త్ర సాంకేతిక రంగాల ద్వారా చేపల ఉత్పత్తి ఉత్పాదకతలలో ప్రపంచవ్యాప్తంగా విప్లవాత్మకమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయని, ఈ మార్పులకు అనుగుణంగా తెలంగాణలోని సాంప్రదాయ మత్స్యకారులకు నిరంతర శిక్షణ సదుపాయాలను కల్పించడం ద్వారా తెలంగాణ మత్స్య రంగంలో గణనీయమైన మార్పులకు అవకాశం కలుగుతుందని అన్నారు. బంగ్లాదేశ్ దేశంలోని మత్స్య రంగంలో మహిళల సాధికారికతను సాధించిన పద్ధతిలోనే తెలంగాణలో కూడా ఇక్కడి మత్స్య రంగంలో మహిళల ఆదాయ వనరులను పెంచేందుకు అద్భుతమైన అవకాశాలు ఉన్నాయని ఆయన అన్నారు. అభివృద్ధి చెందిన దేశాలలో మత్స్యరంగం ఒక ఆధునిక పరిశ్రమగా అభివృద్ధి చెందిందని, మత్స్యరంగం అంటే కేవలం చేపలు పెంచడం, చేపలు పట్టడం మాత్రమే కాదని దానికి అనుబంధంగా “ఫిష్ ప్రాసెసింగ్”, “వాల్యూ ఆడిషన్” తదితర అనేక అనుబంధ రంగాలు కూడా ఎంతో అభివృద్ధిని సాధించాయని, వాటిని అందిపుచ్చుకోవడానికి తెలంగాణలో కూడా ఇక్కడి సాంప్రదాయ మత్స్యకారులకు నిరంతర శిక్షణా సదుపాయాలను కలుగజేయాలని, ఆ దిశలో “తెలంగాణ ఫిషరీస్ సొసైటీ” కృషి చేయాలని డాక్టర్ విజయ్ గుప్తా ఆకాంక్షించారు.
“తెలంగాణ ఫిషరీస్ సొసైటీ” ఆవిర్భావ సభకు అధ్యక్షత వహించిన “ఫిషరీస్ ఫెడరేషన్” మాజీ అధ్యక్షులు పిట్టల రవీందర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో మత్స్యకారులు వృత్తిపరంగా ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావడంలోనూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మత్స్యకారుల సంక్షేమం కోసం మరియు మత్స్యరంగం అభివృద్ధి కోసం అమలు చేస్తున్న పథకాలపై రాష్ట్రంలోని మత్స్యకారుల్లో అవగాహన పెంపొందించడంలోనూ “తెలంగాణ ఫిషరీస్ సొసైటీ” కృషి చేయాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం గుర్తించిన కొన్ని కులాలకు మాత్రమే సభ్యత్వాన్ని కల్పించేందుకు కేవలం తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే వెసులుబాటు కల్పించారని, దేశంలోగాని ప్రపంచంలో గాని మరి ఎక్కడ ఇట్లాంటి సదుపాయం లేదని, అందువల్ల రాష్ట్రంలోని సాంప్రదాయ మత్స్యకారులు ఈ రంగంలో వస్తున్న మార్పులను అవగాహన చేసుకుని, తగనుగుణంగా మార్పు చెందవలసిన అవసరం ఉందని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో నీటి వనరుల సౌలభ్యం పెరిగిన నేపథ్యంలో చేపల పెంపకానికి అనువైన పరిస్థితులు నెలకొన్నాయని ఇందుకు అనుగుణంగా ఇక్కడి మత్స్యకారులు ఆధునిక విధానాలను అనుసరించడం ద్వారా తమ ఆదాయ వనరులను పెంపొందించుకోవాలని మాజీ చైర్మన్ పిట్టల రవీందర్ పిలుపునిచ్చారు.
రాష్ట్రంలోని 33 జిల్లాలకు “తెలంగాణ ఫిషరీస్ సొసైటీ” జిల్లాస్థాయి కన్వీనర్లకు ఈ సందర్భంగా డాక్టర్ విజయ్ గుప్తా, పిట్టల రవీందర్ ఆధ్వర్యంలో నియామక పత్రాలను అందజేశారు.