మద్దతు ధర కల్పించడంలో సర్కార్‌ విఫలం 19న కలెక్టరేట్‌ ముట్టడి

ఆదిలాబాద్‌, అక్టోబర్‌ 18 : రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని అఖిల పక్షం రైతు సంఘం నాయకులు దత్తాత్రి, గంగాధర్‌లు ఆరోపించారు. వ్యవసాయ పెట్టుబడులు పెరుగుతున్న దానికి అనుగుణంగా పంటలు ధరలు లేకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని వారు పేర్కొన్నారు. పంటలకు సరైన గిట్టుబాటు ధర కోసం ప్రభుత్వంపై పోరాడాలని వారు పిలుపునిచ్చారు. ప్రభుత్వం దిగి వచ్చే విధంగా పార్టీలకు అతీతంగా ఉద్యమాలు చేపట్టాలని వారు పేర్కొన్నారు. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్‌ చేస్తూ ఈ నెల 19వ తేదీన కలెక్టరేట్‌ ముట్టడి కార్యక్రమాన్ని చేపట్టామని అన్నారు. ఈ కార్యక్రమంలో రైతులు పెద్ద సంఖ్యలో  పాల్గొని విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు. ఈ నెల 19వ తేదీన ఉదయం 10.30 గంటలకు మార్కెట్‌ యార్డ్‌ నుంచి ర్యాలీ చేపట్టిన ర్యాలీ కలెక్టర్‌ కార్యాలయం వరకు కొనసాగుతుందని వారు తెలిపారు.  పత్తి క్వింటాల్‌కు రూ. 6 వేలు, సోయబీన్‌ క్వింటాల్‌కు 4 వేల రూపాయలు మద్దతు ధర చెల్లించాలని ప్రధాన డిమాండ్‌తో ఈ ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టడడం జరిగిందని వారు పేర్కొన్నారు.