మధ్యలోనే రైలు అపేసి వెళ్లిపోయాడు!

ఎవరికైనా సమయపాలన అనేది చాలా ముఖ్యం. ఏ విషయంలోనైనా సమయానికి ఏ పని చేయాలో అది చేసేయాలి. ఉద్యోగులు సమయానికి విధులకు హాజరు కావాలి. సమయానికి ఇంటికి వెళ్లాలి. అయితే.. కొన్నిసార్లు సంస్థ అవసరాల దృష్ట్యా అదనంగా పని చేయాల్సి ఉంటుంది. కానీ ఓ లోకోపైలెట్‌(రైలు డ్రైవర్‌) మాత్రం ప్రయాణికులతో గమ్యస్థానానికి బయలుదేరిన కొద్దిసేపటికే తన పని వేళలు ముగియడంతో రైలును మార్గమధ్యంలోనే ఆపేసి.. ఎంచక్కా ఇంటికి చెక్కేశాడు.

ఈ సంఘటన తాజాగా స్పెయిన్‌లో చోటుచేసుకుంది. సంటండర్‌ ప్రాంతం నుంచి మాడ్రిడ్‌కి 150మందితో ఓ రైలు బయలుదేరింది. రెండు గంటలు ప్రయాణించి ఒసొర్నొ అనే వూరు దాటిన తర్వాత లోకో పైలెట్‌ ఒక్కసారిగా రైలును నిలిపివేశాడు. తన పని వేళలు ముగిశాయని రైలు అక్కడే వదిలేసి కాలినడకన ఇంటికి వెళ్లిపోయాడు. ప్రయాణికులు మొదట సాంకేతిక లోపం కారణంగా ఆగిపోయిందని భావించారు. కొద్దిసేపటికి అసలు విషయం తెలిసి బిత్తరపోయారు.

ఎంతసేపటికీ ప్రత్యామ్నాయం చూపకపోవడంతో కొంత మంది ప్రయాణికులు రైలు దిగి దగ్గర్లో ఉన్న వూర్లోకి కాలి నడకన వెళ్లి బస్సుల్లో తమ గమ్యస్థానాలకు వెళ్లిపోయారు. మరికొందరు ఏమీ చేయలేక రైలులోనే ఉండిపోయారు. చివరకు రెండు గంటల తర్వాత మరో డ్రైవర్‌ను ఏర్పాటు చేసి రైలు ప్రయాణాన్ని కొనసాగించారు.

నిజానికి మొదటి నుంచే ఆ రైలులో ప్రత్యామ్నాయ లోకోపైలెట్‌ ఉండాలి. కానీ.. అలా జరలేదు. ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి అధికారులు క్షమాపణలు చెప్పారు.