మధ్యాహ్న భోజన కార్మికుల..

సమస్యలు పరిష్కరించండి
– పీఎఫ్‌, ఈఎస్‌ఐ సౌకర్యాలు కల్పించండి
– కేంద్రమంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌ తో ఎంపీ కవిత భేటీ
– మధ్యాహ్న భోజన కార్మికులతో కలిసి వినతి అందించిన ఎంపీ
న్యూఢిల్లీ, ఆగస్టు 3(జ‌నం సాక్షి) :  మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ శుక్రవారం కేంద్ర మంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌ను తెరాస ఎంపీ కవిత కలిసి విన్నవించారు. మధ్యాహ్న భోజన కార్మికులతో కలిసి ఎంపీ కేంద్ర మంత్రిని కలిశారు. ఈసందర్భంగా మధ్యాహ్న భోజన కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేలా చొవ చూపాలని మంత్రికి విజ్ఞప్తి చేశారు. అనంతరం ఎంపీ కవిత విూడియాతో మాట్లాడుతూ మధ్యాహ్న భోజన కార్మికులకు నెలకు వెయ్యి రూపాయలే ఇస్తున్నారని అన్నారు. వారికి వేతనం రూ.10,500కు పెంచి… పీఎఫ్‌, ఈఎస్‌ఐ సౌకర్యాలు కల్పించాలని ఎంపీ కవిత డిమాండ్‌ చేశారు. చాలీ చాలని జీతాలతో కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వారి సమస్యలు పరిష్కరించాలని కోరినట్లు తెలిపారు. దేశవ్యాప్తంగా ఉన్న లక్షల మంది మధ్యాహ్న భోజన  వంట కార్మికులకు కనీస వేతన చట్టం ప్రకారం నెలకు పదివేల 500ల వేతనం అందేలా చూడాలన్నారు. 2010లో వీరికి వేతనాలు పెంచారని అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్క పైసా కూడా పెంచలేదని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై మంత్రి సానుకూలంగా స్పందించినట్లు కవిత తెలిపారు. ఇదిలా ఉంటే మధ్యాహ్న భోజనం పథకం సిబ్బంది సమస్యల పరిష్కారానికి ఎంపీ కవిత కృషి చేస్తున్నారు. టీఆర్‌ఎస్‌ కార్మిక విభాగం ఆధ్వర్యంలో మధ్యాహ్న భోజన వంట కార్మికుల సంఘం ఇచ్చిన చలో ఢిల్లీ పిలుపు మేరకు తెలంగాణ నుంచి పెద్దఎత్తున కార్మికులు ఢిల్లీకి తరలివెళ్లారు. 31జిల్లాల ప్రతినిధుల బృందాన్ని .. ఎంపీ కవిత  కేంద్ర కార్మికశాఖ ఉన్నతాధికారులతో సమావేశపరిచారు. సమస్యలను వివరించారు.