మనుగడ కోసం ఆరాటం.. బీఆర్‌ఎస్ జలజగడ పోరాటం
` జల వివాదం ద్వారా లబ్ధి పొందాలని కేసీఆర్ ప్రయత్నం
` బీఆర్‌ఎస్ మనుగడ కష్టమని ఆయన గుర్తించారు..
` పాలమూరు`రంగారెడ్డి డీపీఆర్ ఏడేళ్ల వరకు సమర్పించలేదు..
` తెలంగాణకు 299 టీఎంసీలు చాలని అంగీకరిస్తూ కేసీఆర్ రాష్ట్రానికి తీరని ద్రోహం చేశారు
` తదుపరి బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ తీర్పు రాకుండా వాయిదా వేయించారు
` పాలమూరు ప్రాజెక్టును జూరాల నుంచి శ్రీశైలానికి మార్చడంలో భారీ స్కామ్
` ప్రధానంగా నీళ్ల హక్కుల కోసమే తెలంగాణ ఉద్యమం జరిగింది
` గతంలో నీళ్ల విషయంలో ఎన్నో పొరపాట్లు జరిగాయి
` నదీ పరివాహకం ప్రకారం చూస్తే కృష్ణా జలాల్లో తెలంగాణకు 71శాతం రావాలి
` నీళ్లు ` నిజాలపై పవర్‌పాయింట్ ప్రజెంటేషన్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
హైదరాబాద్(జనంసాక్షి): తెలుగు రాష్ట్రాల మధ్య జలవివాదం సృష్టించి.. తద్వారా లబ్ధి పొందాలని భారత రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆరోపించారు. నీటి వాటాలపై చర్చ దృష్ట్యా ప్రజాప్రతినిధులకు అవగాహన కోసం ‘నీళ్లు`నిజాలు’ అంశంపై ప్రజాభవన్‌లో మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. ఆ తర్వాత ముఖ్యమంత్రి విూడియాతో మాట్లాడారు.‘‘ప్రధానంగా నీళ్ల హక్కుల కోసమే తెలంగాణ ఉద్యమం జరిగింది. కృష్ణా, గోదావరి జలాలను సక్రమంగా వాడుకుంటే ఎంతో అభివృద్ధి చెందిన రాష్ట్రంగా తెలంగాణ నిలిచి ఉండేది. నీళ్ల కోసం ఉమ్మడి రాష్ట్రంలో పీజేఆర్ స్వంత ప్రభుత్వాన్ని నిలదీశారు. గతంలో నీళ్ల విషయంలో ఎన్నో పొరపాట్లు జరిగాయి. ఆ పొరపాట్లను సరిదిద్దుకుంటూ ముందుకు వెళ్తున్నాం. ఉమ్మడి ఏపీకి కృష్ణా జలాల్లో 811 టీఎంసీలు కేటాయించారు. రాష్ట్రం విడిపోయినప్పుడు కృష్ణా జలాల్లో ఏపీకి 512 టీఎంసీలు, తెలంగాణకు 299 టీఎంసీలు అని చెప్పారు. తెలంగాణకు 299 టీఎంసీలు చాలని అంగీకరిస్తూ పదేళ్ల కాలానికి కేసీఆర్ సంతకం చేశారు. కేసీఆర్ పెట్టిన సంతకం ఏపీకి అడ్వాంటేజ్‌గా మారింది. అప్పుడు ఏపీకి 66శాతం, తెలంగాణకు 34 శాతం జలాలకు ఆయన అంగీకరించారు. తదుపరి బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ తీర్పు రాకుండా వాయిదా వేయిస్తున్నారు. నదీపరివాహకం ప్రకారం చూస్తే.. కృష్ణా జలాల్లో తెలంగాణకు 71శాతం రావాలి. నదీ పరివాహకం ప్రకారం జలాలు కావాలని వాదించాల్సి ఉండగా.. కేసీఆర్ అలా అడగలేదు. కృష్ణాలో 299 టీఎంసీలకు కేసీఆర్ అంగీకరించారని ఇవాళ కేఆర్‌ఎంబీ అంటోంది.
బీఆర్‌ఎస్ మనుగడ కష్టమని కేసీఆర్ గుర్తించారు..
అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో, ఆ తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితి పరాజయం పాలైంది. ఎన్నికల్లో వరుస ఓటములతో భారత రాష్ట్ర సమితి మనుగడ కష్టమవుతోందని కేసీఆర్ గుర్తించారు. మళ్లీ జలవివాదం రేపి, ఇరు రాష్ట్రాల మధ్య వైషమ్యాల సృష్టించి తన పార్టీని బ్రతికించుకోవాలని ప్రయత్నిస్తున్నారు. దాంట్లో భాగంగా ఒక అబద్ధాల సంఘాన్ని ఏర్పాటుచేసుకొని కాంగ్రెస్ ప్రభుత్వంపై లేనిపోని అపోహలు సృష్టించేందుకు ప్రయత్నం చేస్తున్నారు. పార్టీని బతికించుకునేందుకు మళ్లీ నీళ్ల సెంటి మెంట్‌ను వాడుకుంటున్నారు. చంద్రబాబు పేరు చెప్పి తెలంగాణలో మళ్లీ పార్టీని బతికించుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు’’ అని సీఎం విమర్శించారు.
పాలమూరు`రంగారెడ్డి డీపీఆర్ ఏడేళ్ల వరకు సమర్పించలేదు..
పాలమూరు`రంగారెడ్డి ప్రాజెక్టుకు కేసీఆర్ ఏడేళ్ల వరకు డీపీఆర్ సమర్పించలేదు. డీపీఆర్ రూపొందించకుండానే రూ.27వేల కోట్లు ఖర్చు చేశారు. డీపీఆర్ రూపొందించలేదు కాబట్టి.. పర్యావరణ అనుమతులు కూడా రాలేదు. అనుమతులు లేని ప్రాజెక్టులు నిర్మిస్తున్నారని పాలమూరు రంగారెడ్డిపై కేసులు వేశారు. సుప్రీంకోర్టులో కేసులు వేయడంతో పాలమూరు`రంగారెడ్డి ప్రాజెక్టు సాగునీటి ప్రాజెక్టు కాదని అఫిడవిట్ వేశారు. తాగునీటి కోసం 7.15 టీఎంసీల సామర్థ్యంతో ప్రాజెక్టు నిర్మిస్తున్నామని కోర్టుకు చెప్పారు. కవిూషన్ల కోసం పంపులు, లిఫ్టుల కంపెనీలకు రూ.27వేల కోట్లు చెల్లింపులు చేశారు. ఎత్తిపోతల ప్రాజెక్టుల ద్వారా అయితేనే కవిూషన్లు భారీగా వస్తాయని కేసీఆర్ కుట్ర చేశారు. పాలమూరు`రంగారెడ్డి ప్రాజెక్టుకు జూరాల నుంచి నీటిని తీసుకునేలా రూపొందించారు. జూరాల నుంచి అయితేనే లిఫ్ట్‌లు ఎక్కువ పెట్టలేమని భావించిన కేసీఆర్ దాన్ని శ్రీశైలానికి మార్చారు. తల దగ్గర నుంచి నీరు తీసుకునేది వదిలేసి తోక దగ్గర నీళ్లు తీసుకునేలా డిజైన్ చేశారు. శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి 0.25 టీఎంసీలు మాత్రమే తీసుకునే దుస్థితి ఏర్పడిరది. ఏపీ ప్రభుత్వం మాత్రం రోజుకు 13 టీఎంసీలు తరలించేలా ప్రాజెక్టులు పూర్తి చేసుకున్నది. ఏపీలో పనిచేసిన ఆదిత్యనాథ్ దాస్‌ను సలహదారుగా నియమించుకున్నారని ఆరోపిస్తున్నారు. ఆయనకు తెలంగాణలోని ఇరిగేషన్ ప్రాజెక్టులపై పూర్తి అవగాహన ఉన్నది. కేసీఆర్‌కు ఆహ్వానంపలుకుతున్నా.. శాసనసభలో చర్చ చేద్దాం రండి. సభలో మంచి సంప్రదాయాన్ని నెలకొల్పుదాం’’ అని సీఎం అన్నారు.
‘పాలమూరు ` రంగారెడ్డి’ పూర్తికి రూ.80 వేల కోట్లు అవసరం
` ఇప్పటి వరకు రూ.27 వేల కోట్లు ఖర్చు చేసినా ఒక్క ఎకరానికి కూడా నీళ్లు ఇవ్వలేదు: ఉత్తమ్
హైదరాబాద్(జనంసాక్షి): పాలమూరు ` రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తి చేయాలంటే రూ.80 వేల కోట్లు అవసరమని తెలంగాణ నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఈ ప్రాజెక్టుపై రూ.27 వేల కోట్లు ఖర్చు చేసినట్లు భారత రాష్ట్ర సమితి ప్రభుత్వం చెప్పిందన్నారు. నీటి వాటాలపై అసెంబ్లీలో శుక్రవారం చర్చ జరగనున్న దృష్ట్యా ‘నీళ్లు`నిజాలు’ అంశంపై ప్రజాప్రతినిధులకు అవగాహన కోసం మంత్రి ఉత్తమ్ పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్, పలువురు మంత్రులు పాల్గొన్నారు. ఏపీ చేపట్టిన రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టు, ఇతరపథకాలపై ఉత్తమ్ వివరణ ఇచ్చారు. ‘‘పాలమూరు ప్రాజెక్టు కోసం గత ప్రభుత్వం రూ. 27 వేల కోట్లు ఖర్చు చేసినా ఒక్క ఎకరానికి కూడా నీళ్లు ఇవ్వలేదు. ఇప్పుడు ఆ ప్రాజెక్టు పూర్తి చేయడానికి రూ.80 వేల కోట్లకుపైగా కావాలి. రూ.80వేల కోట్ల ప్రాజెక్టుపై రూ.27వేల కోట్లు ఖర్చు చేస్తే 90 శాతం పూర్తయినట్టా? మేం వచ్చాక రూ.7 వేల కోట్లు ఖర్చు చేశాం. కాంగ్రెస్ ప్రభుత్వం తట్టెడు మట్టి తీయలేదని ప్రతిపక్షం దుష్ప్రచారం చేస్తోంది’’ అని ఉత్తమ్ మండిపడ్డారు.

