మన గ్లోబల్ లీడర్..
ఏ సదస్సులో మాట్లాడుతున్నాడో?
– ఐరాస్ వెబ్‌సైట్‌లో నమోదైన 313ఈవెంట్లలో బాబు పేరులేదు
– టీడీపీ నేతలు గొప్పల కోసం అసత్యాలను ప్రచారం చేసుకుంటున్నారు
– ట్విట్టర్‌లో బీజేపీ ఎంపీ జీవీఎల్ మండిపాటు
అమరావతి, సెప్టెంబర్24(జనంసాక్షి) : ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ (యూఎన్‌జీఏ) సమావేశాల సందర్భంగా ఐరాస అనుబంధ సంస్థ నిర్వహిస్తున్న ఓ సదస్సులో వ్యవసాయం గురించి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రసంగించబోతున్నారంటూ టీడీపీ నేతలు ఊదరగొడుతున్న ప్రచారంపై బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు ట్విట్టర్ ద్వారా పలు ప్రశ్నాస్త్రాలు సంధించారు. ఐరాస సార్వత్రిక అసెంబ్లీ సమావేశాల సందర్భంగా నిర్వహిస్తున్న 313అనుబంధ ఈవెంట్లలో చంద్రబాబు ప్రసంగించబోయే ఈవెంట్ లేదని, చంద్రబాబు ప్రసంగించబోయే యూఎన్‌ఈపీ ఈవెంట్‌ను యూఎన్‌ఈపీ, బీఎన్‌పీ బరిబాస్, వరల్డ్ ఆగ్రోఫారెస్టీ నిర్వహిస్తాయని పేర్కొన్నప్పటికీ.. ఐరాస అనుబంధ ఈవెంట్స్ జాబితాలో ఇది నమోదు కాలేదని ఆయన ట్విటర్‌లో వెల్లడించారు. ఒకవేళ ఉంటే టీడీపీ లింక్‌ను షేర్ చేయాలని అన్నారు. ఈ నెల 24న ‘సుస్థిర వ్యవసాయాభివృద్ధిలో ప్రపంచంలో ఎదురువుతున్న సవాళ్లు’ అనే అంశంపై యూఎన్‌ఈపీ ఏర్పాటుచేసిన సమావేశంలో చంద్రబాబు ప్రసంగిస్తారని ప్రచారం చేసిన సంగతి తెలిసిందే. ఇందుకోసం చంద్రబాబు అమెరికాకు బయలుదేరి వెళ్లారు. అయితే, సదరు సదస్సు ఐరాస్ వెబ్‌సైట్‌లో నమోదైన 313 ఈవెంట్లలో లేదని, కావాలంటే వెతుక్కొని చూడవచ్చునని, ఇంతకు ‘మన గ్లోబల్ లీడర్’ చంద్రబాబు ఏ సదస్సులో మాట్లాడుతున్నారని జీవీఎల్ ప్రశ్నించారు.