మన యాదగిరి గుట్టకు హరితపుణ్యక్షేత్రం అవార్డు

` సీఎం కేసీఆర్‌ హర్షం
హైదరాబాద్‌(జనంసాక్షి):యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయానికి 2022 ` 2025 సంవత్సరాలకు గాను ఇండియన్‌ గ్రీన్‌ బిల్డింగ్‌ కౌన్సిల్‌ ప్రదానం చేసే గ్రీన్‌ ప్లేస్‌ ఆఫ్‌ వర్షిప్‌ (ఆధ్యాత్మిక హరిత పుణ్య క్షేత్రం) అవార్డు లభించడం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్‌ హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి పుణ్య క్షేత్రానికి ఈ ప్రతిష్టాత్మక అవార్డు దక్కడం సంతోషకరమని అన్నారు.స్వయం పాలనలో తెలంగాణ దేవాలయాలకు జాతీయ, అంతర్జాతీయ అవార్డులు దక్కడం భారతదేశ సాంస్కృతిక, ఆధ్యాత్మిక వారసత్వానికి దక్కిన గౌరవమని సీఎం అన్నారు. తెలంగాణ దేవాలయానికి ఆధ్యాత్మిక హరిత పుణ్య క్షేత్రం అవార్డు రావడం, ప్రజల మనోభావాలను, మత సాంప్రదాయాలను గౌరవిస్తూ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన యాదగిరిగుట్ట పునర్నిర్మాణం, భారతీయ ఆధ్యాత్మిక పునురుజ్జీవన వైభవానికి నిదర్శనంగా నిలిచిందని సీఎం కేసీఆర్‌ తెలిపారు.యాదాద్రి ఆలయ పవిత్రతకు, ప్రాశస్త్యానికి భంగం కలగకుండా తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ఆధునీకరణ పనులను ఇండియన్‌ గ్రీన్‌ బిల్డింగ్‌ కౌన్సిల్‌ ప్రశంసించడం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి దక్కిన అపూర్వ గౌరవమని సీఎం అన్నారు. తెలంగాణ ప్రజల ఇలవేల్పు యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి పుణ్యక్షేత్రాన్ని భక్తులకు మరింత చేరువ చేసేందుకు ప్రతిష్టాత్మకంగా పునఃప్రతిష్ఠ చేసిందని సీఎం తెలిపారు. తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా వర్దిల్లేలా యాదగిరి పంచ లక్ష్మీనరసింహ స్వామి కృపాకటాక్షాలు ప్రజల పై ఉండాలని ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ ప్రార్థించారు.

తాజావార్తలు