మన సెమీస్ ప్రత్యర్థి ఎవరు?

మన సెమీస్ ప్రత్యర్థి ఎవరు?

అడిలైడ్: భారత్ జైత్రయాత్ర కొనసాగుతోంది. క్వార్టర్స్లో బంగ్లాదేశ్పై విజయం సాధించింది. ఇక భారత్కు సెమీస్ ప్రత్యర్థి ఎవరు? ఆస్ట్రేలియానా లేక పాకిస్థానా? ఈ రెండు జట్లలో ఎవరన్నది రేపు తేలనుంది.  శుక్రవారం జరిగే మూడో క్వార్టర్ ఫైనల్లో ఆసీస్, పాక్ అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఈ మ్యాచ్లో విజేత జట్టుతో భారత్ సెమీస్లో తలపడనుంది. ప్రపంచ కప్లో టీమిండయాకు పాకిస్థాన్పై ఓటమెరుగని రికార్డు ఉంది. తాజా ఈవెంట్లోనూ ఓసారి ఓడించింది. సొంతగడ్డపై ఆసీస్ బలమైన జట్టయినా భారత్ మంచి జోరుమీదుంది. కాబట్టి సెమీస్ ప్రత్యర్థి ఎవరైనా ధోనీసేన ఆత్మవిశ్వాసంతో ఎదుర్కోవడం ఖాయం.

సొంతగడ్డపై కొట్టినపిండిలాంటి పిచ్, అభిమానుల మద్దతు, సానుకూల వాతావరణం కంగారూలకు కలసివచ్చే అంశాలు. ఆసీస్ అన్ని విభాగాల్లో బలోపేతంగా కనిపిస్తోంది. హిట్టర్లు, ఆల్ రౌండర్లు, నిప్పులు చెరిగే పేసర్లకు కొదవలేదు. ప్రపంచ కప్లో ఆసీస్ కేవలం ఓ మ్యాచ్లో మాత్రమే ఓడింది. అదీ పొరుగు జట్టు న్యూజిలాండ్తో మ్యాచ్లో. నాలుగు లీగ్ మ్యాచ్ల్లో గెలవగా, బంగ్లాతో మ్యాచ్ వర్షం కారణంగా రద్దయ్యింది. పాక్తో మ్యాచ్లో క్లార్క్ సేన ఫేవరెట్గా బరిలో దిగనుంది.

పాకిస్థాన్ విషయానికొస్తే నిలకడలేమని ప్రధాన సమస్య. ఎప్పుడెలా ఆడుతుందో చెప్పడం కష్టం. తనదైన రోజున ఏ జట్టునయినా చిత్తుచేయగల సత్తా పాక్ సొంతం. అయితే తాజా ఈవెంట్లో పాక్ ప్రదర్శన అనిశ్చితిగా సాగింది. ఓ దశలో నాకౌట్ చేరడంపై సందేహాలు వ్యక్తమయ్యాయి. స్వదేశంలో తీవ్ర విమర్శలు ఎదుర్కొంది. లీగ్ దశలో భారత్, వెస్టిండీస్తో మ్యాచ్ల్లో ఓటమి చవిచూసింది. 6 లీగ్ మ్యాచ్లకు గాను నాలుగింటిలో గెలిచినా అగ్రశ్రేణి జట్లలో సౌతాఫ్రికాపై మాత్రమే గెలిచింది. మిగిలిన మూడు విజయాలు చిన్న జట్లపై సాధించినవే. ఈ నేపథ్యంలో పాక్.. ఆసీస్ జోరును ఏమాత్రం అడ్డుకుంటుందో చూడాలి. పాక్ బ్యాటింగ్లో కంటే బౌలింగ్లో పటిష్టంగా ఉంది.