మమ్మల్ని తక్కువ అంచనా వేస్తున్నారు
– జనసేన బలం 18శాతం మించే ఉంటుంది
– నాలుగైదు శాతమే అనడం సరికాదు
– లగడపాటి సర్వేపై స్పందించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్
అమరావతి, సెప్టెంబర్28(జనంసాక్షి ) : మాజీ ఎంపీ లగడపాటిలాంటి వారు తమ సర్వేల్లో జనసేన బలాన్ని
తక్కువగా అంచనావేస్తున్నారని ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. శుక్రవారం పవన్ స్పందించారు. జనసేన ప్రభావం కేవలం నాలుగైదు శాతం మాత్రమే ఉంటుందని అంటున్నారని.. కానీ తమ బలం 18 శాతమని, ఈ విషయాన్ని అందరూ గుర్తుపెట్టుకోవాలని చెప్పారు. జనసేన కోసం తన ప్రాణాలనే పెట్టుబడిగా పెట్టానని పవన్ అన్నారు. తొమ్మిది నెలల్లో ముఖ్యమంత్రి అయిపోవాలనే ఆశతో తాను రాజకీయాల్లోకి రాలేదని చెప్పారు. బలమైన సిద్ధాంతాలను, విధానాలను తీసుకొస్తామని అన్నారు. పొలిటికల్ క్రిమినల్స్ ను, క్రిమినల్స్ ను తరిమేస్తామని అన్నారు. ఆమేరకు జనసేన పార్టీ కృషి చేస్తుందని, పార్టీలోకి వచ్చేవారు అలానే ఉంటారని అన్నారు. కానీ కొందరు సర్వేలు చేశామంటూ కొంతశాతం ఇస్తూ జనసేనను నిర్వీర్యం చేయాలని చూస్తున్నారని ఇలాంటి చర్యలు సరికాదన్నారు. ప్రజలు జపసేవైపు ఉన్నారని, తప్పకుండా తమ బలాన్ని నిరూపించుకుంటామని పవన్ పేర్కొన్నారు. సేంద్రీయ వ్యవసాయం తామే చేశామని అమెరికాలో ముఖ్యమంత్రి చంద్రబాబు చాలా గొప్పగా చెప్పుకున్నారని… కానీ రాష్ట్రంలో దానికి విరుద్ధమైన పరిస్థితి ఉందని జనసేనాని చెప్పారు. చేపల చెరువుల్లోని విషం చెట్లకు పాకుతోందని… ఇలాంటి చోట్ల కొబ్బరిబోండాలు తాగిన వ్యక్తుల కాళ్లు, చేతులు కూడా పడిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.