మయన్మార్‌లో సూకీ శకం

nf2ncijyయాంగూన్: మయన్మార్ ఎన్నికల్లో ప్రతిపక్ష నేత, నోబెల్ శాంతి పురస్కార గ్రహీత అంగ్‌సాన్ సూచీ నేతృత్వంలోని నేషనల్ లీగ్ ఆఫ్ డెమొక్రసీ (ఎన్‌ఎల్‌డీ) చరిత్రాత్మక విజయం దిశగా దూసుకెళ్తోంది. మొదటి విడత సీట్లలో యాంగూన్‌లోని 57 పార్లమెంట్ స్థానాలకు గానూ 56 సీట్లను ఎన్‌ఎల్‌డీ గెలుచుకుంది. 44 దిగువ సభ స్థానాలను, 12 ఎగువ సభ స్థానాలను గెలుచుకున్నట్లు ఎన్‌ఎల్‌డీ ప్రకటించింది. ఒక పార్లమెంటు సీటును యూఎస్‌డీపీ గెలుచుకుంది. యాంగూన్ ప్రాంతీయ పార్లమెంటులోని 90 స్థానాలకు గానూ అత్యధికంగా 87 సీట్లలో ఎన్‌ఎల్‌డీ విజయం సాధించింది. మయన్మార్‌లో ప్రధాన ఎన్నికలతో పాటు ప్రాంతీయ పార్లమెంట్‌లకూ ఒకేసారి ఎన్నికలు నిర్వహించారు. పూర్తిస్థాయి ఓట్ల లెక్కింపుకు 10 రోజుల సమయం పడ్తుందని ఆదివారం పోలింగ్ అనంతరం ఎన్నికల అధికారులు ప్రకటించారు. ఫలితాల సరళి నేపథ్యంలో ఎన్‌ఎల్‌డీ పార్టీ కార్యాలయం వద్ద పండుగ వాతావరణం నెలకొంది. ఎర్ర చొక్కాలతో పార్టీ కార్యకర్తలు సంబరాలు జరుపుకుంటున్నారు. దశాబ్దాల ప్రత్యక్ష, పరోక్ష సైనిక పాలన నుంచి స్వేచ్ఛ పొందబోతోందన్న ఉత్సాహం వారిలో కనిపిస్తోంది.

ఈ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా 70% పైగా సీట్లను సాధించనున్నామని ఎన్‌ఎల్‌డీ అధికార ప్రతినిధి విన్ టీన్, 90% పైగా గెలుస్తామని మరో అధికార ప్రతినిధి న్యాన్ విన్ విశ్వాసం వ్యక్తం చేశారు. అధికారం చేపట్టేందుకు అందుబాటులో ఉన్న పార్లమెంటు సీట్లలో కనీసం 67% సీట్లను ఎన్‌ఎల్‌డీ గెల్చుకోవాల్సి ఉంటుంది. భవిష్యత్తులోనూ అధికారం కోల్పోకుండా ఉండే ఉద్దేశంతో 25% సీట్లను అధికార యూనియన్ సాలిడారిటీ అండ్ డెవలప్‌మెంట్ పార్టీ (యూఎస్‌డీపీ)కి కట్టబెడ్తూ రాజ్యాంగంలో రాసుకున్నారు. అందువల్ల మొత్తం 664 పార్లమెంట్ స్థానాల్లో కనీసం 67% సీట్లను ఎన్‌ఎల్‌డీ సాధించగలిగితేనే.. అధికార యూఎస్‌డీపీ, దాని సైనిక మిత్రపక్షాలను ఓడించగలుగుతుంది.

 గెలిచినా సూచీ అధ్యక్షురాలు కాలేరు
ఈ ఎన్నికల్లో ఎన్‌ఎల్‌డీ గెలిచినా పార్టీ అధినేత అంగ్‌సాన్ సూచీ (70) దేశాధ్యక్షురాలు కాలేరు. మయన్మార్ రాజ్యాంగం ప్రకారం జీవిత భాగస్వామి విదేశీయులైనా, విదేశీ పౌరసత్వం గల పిల్లలున్నా.. ఆ వ్యక్తి దేశానికి అధ్యక్షుడు లేదా అధ్యక్షురాలు కావడానికి వీల్లేదు. సూచీ దివంగత భర్త బ్రిటన్‌కు చెందిన వారు. ఆమె పిల్లలిద్దరికీ బ్రిటిష్ పౌరసత్వం ఉంది. ఎన్నికల్లో ఎన్‌ఎల్‌డీ గెలిస్తే.. అధ్యక్షురాలిగా కాకున్నా.. దేశ అత్యున్నత నాయకురాలిగా దిశానిర్దేశం చేస్తానని సూచీ స్పష్టం చేశారు.