మయన్మార్ ఎన్నికల్లో సూచీదే విజయం!

2
 నేపిడా : మయన్మార్ ఎన్నికల్లో ముందునుంచి ఊహించినట్లే ప్రతిపక్ష నేత, పోరాట యోధురాలు ఆంగ్ సాన్ సూచీ పార్టీ ఘన విజయం సాధించినట్లు రాయిటర్స్ వార్తాసంస్థ పేర్కొంది. ఆదివారం జరిగిన ఎన్నికల ఓట్ల లెక్కింపు సోమవారం మొదలైంది. ఇంతవరకు అధికారికంగా ఫలితాలేవీ వెలువడకపోయినా, అధికార యూఎస్‌డీపీ నాయకుడు హెచ్‌టే ఊ తమ ఓటమిని అంగీకరించారు. ”మేం ఓడిపోయాం” అని ఆయన చెప్పినట్లు రాయిటర్స్ పేర్కొంది. దాదాపు పాతికేళ్ల తర్వాత మయన్మార్‌లో తొలిసారి స్వేచ్ఛాయుతంగా, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరుగుతున్నాయి.

ప్రాథమిక అంచనాలను బట్టి ఎలాంటి భేషజాలకు పోకుండా తమ పరాజయాన్ని అంగీకరిస్తున్నామని, అయితే తుది ఫలితాలు ఇంకా తెలియలేదని యూఎస్‌డీపీ నేత అన్నారు. తన సొంత నియోజకవర్గంలో కూడా భారీ మెజారిటీతో సూచీ పార్టీ విజయం సాధించడం ఆశ్చర్యం కలిగించిందని ఊ చెప్పారు. తమ ప్రాంతంలో ప్రజల అభివృద్ధికి చాలా చేశామని, అయితే వాళ్ల నిర్ణయం మాత్రం వేరేగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.