మరాఠాల ఆందోళనకు రాజకీయ మద్దతు

Sindhudurg: Maratha Community people participate in a “Maratha Karnti Morcha” in Sindhudurg, Maharashtra on Sunday. PTI Photo (PTI10_23_2016_000150A)

– మహారాష్ట్రలో ఐదుగురు ఎమ్మెల్యేల రాజీనామా
ముంబయి, జులై27(జ‌నంసాక్షి) : ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యా సంస్థల్లో రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్‌ చేస్తూ మహారాష్ట్రలో ఆందోళనకు దిగిన మరాఠాలకు రాజకీయ మద్దతు లభిస్తోంది. మరాఠాల ఆందోళనకు మద్దతుగా పార్టీలకు అతీతంగా ఐదుగురు శాసనసభ్యులు తమ పదవులకు రాజీనామా చేశారు. పాలక భాజపా సహా శివసేన, కాంగ్రెస్‌ల నుంచి ఒక్కో శాసనసభ్యుడు ఎన్సీపీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు రాజీనామా సమర్పించారు. మరాఠా యువత భావోద్వేగాలను గౌరవించి పదవులు వదులుకుంటున్నట్లు వారు తెలిపారు. అటు మరాఠాల ఆందోళన ఉద్ధృతం అవుతున్న నేపథ్యంలో పరిస్థితిపై చర్చించేందుకు మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌ ఢిల్లీ వెళ్లారు. పలువురు సీనియర్‌ కేంద్ర మంత్రులు, భాజపా అగ్ర నేతలతో భేటీ అయిన ఫడణవీస్‌ సమస్య పరిష్కారంపై చర్చించారు. ఇదిలా ఉంటే మరాఠాలకు ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించాలని ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా మరాఠీలు బంద్‌ నిర్వహించారు. ఈ బంద్‌ ఉద్రిక్తంగా మారడంతో పలు అవాంఛనీయ సంఘటన చోటు చేసుకున్నాయి. పలువురు మరాఠాలు బస్సులకు, వాహనాలను నిప్పు పెట్టడంతో పోలీసులు అడ్డుకున్నారు. ఆందోళన కారులకు, పోలీసులకు గాయాలయ్యాయి. ఉద్రిక్తత నేపథ్యంలో మధ్యాహ్నం వరకు బంద్‌ను విరమిస్తున్నట్లు క్రాంతి మరాఠా నేతలు స్పష్టం చేశారు. మరోవైపు తమ సమస్యలను పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని లేకుంటే ఆందోళనలు ఉదృతం చేస్తామని హెచ్చరించడంతో ప్రభుత్వం సమస్యను పరిష్కరించేలా చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది.