మరాఠాల డిమాండ్‌పై.. 

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చిత్తశుద్ది లేదు
– సీఎం ఢిల్లీ వెళ్లరు… మోదీ దేశంలో ఉండరు!
– శివసేన ఆగ్రహం
ముంబయి, జులై28(జ‌నం సాక్షి) : మరాఠాల రిజర్వేషన్‌ డిమాండ్‌పై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఏమాత్రం చిత్తశుద్ధి లేదని శివసేన నిప్పులు చెరిగింది. అటు ముఖ్యమంత్రి ఫడ్నవిస్‌ కానీ, ప్రధాని మోదీ కానీ నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారంటూ శివసేన పార్టీ పత్రిక ‘సామ్నా’ తాజా సంపాదకీయంలో విరుచుకుపడింది. ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్‌ ఎందుకు ఢిల్లీ వెళ్లరని నిలదీసింది. ప్రధాని దాదాపు ఢిల్లీలోనే ఉండటం లేదని విమర్శించింది. మహారాష్ట్ర అన్నా, దేశమన్నా ఏమాత్రం మోదీకి ఆసక్తి లేదని, ఆందోళనలను బలవంతంగా అణచివేయడమే ప్రభుత్వ విధానమని సంపాదకీయం తప్పుపట్టింది. ఒకవేళ ముఖ్యమంత్రి ఢిల్లీ వెళ్లినా…ఎక్కువ సమయం విదేశాల్లో ప్రధాని గడుపుతున్నందున ఆయన ఎవరిని కలవాలని పేర్కొంది. దీన్ని బట్టి చూసే రాష్ట్ర ప్రయోజనాలపై మోదీకి ఎలాంటి ఆసక్తి లేదని తెలుస్తోందని పేర్కొంది. మరాఠా కోటాపై చేతులెత్తేసిన ఫడ్నవిస్‌ కనీసం రాష్ట్ర మంత్రి పంకజ ముండేకి ఒకరోజు సీఎం పదవి ఇచ్చినా ఆమైనా సరైన నిర్ణయం తీసుకుంటుంది అని శివసేన ఎద్దేవా చేసింది. ఇప్పటికైన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి మురాఠీల రిజర్వేషన్లపై సానుకూలంగా స్పందించాలని శిశవసేన సూచించింది.