మరింత క్షీణించిన కరుణానిధి ఆరోగ్యం

– అర్థరాత్రి సమయంలో ఆస్పత్రికి తరలింపు
– భారీగా తరలివచ్చిన డీఎంకే కార్యకర్తలు
– ఐసీయూలో చికిత్స అందిస్తున్న వైద్యులు
– కరుణానిధిని పరామర్శించిన తమిళ గవర్నర్‌ భన్వరిలాల్‌ పురోహిత్‌
– నాన్న కోలుకుంటున్నారన్న కనిమొళి
చెన్నై, జులై28(జ‌నం సాక్షి) : డీఎంకే అధినేత, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న విషయం విధితమే. కాగా శుక్రవారం సాయంత్రం వరకు ఇంటివద్దనే కరుణానిధికి వైద్యులు చికిత్స అందించారు. శుక్రవారం రాత్రి సమయంలో ఆరోగ్యం మరింత విషమించడంతో ఆయన్ను అర్థరాత్రి సమయంలో హుటాహుటీన చెన్నైలోని కావేరీ దవాఖానకు తరలించారు. కుమారుడు, డీఎంకే కార్యనిర్వాహక అధ్యక్షుడు ఎంకే స్టాలిన్‌, కుమార్తె కనిమొళి ఆయన వెంట ఉన్నారు.  దీంతో ఆయన ఆరోగ్యంపై డీఎంకే వర్గాల్లో ఆందోళన నెలకొంది. భారీ సంఖ్యలో కార్యకర్తలు, నేతలు, అభిమానులు ఆస్పత్రి వద్దకు చేరుకున్నారు. కరుణానిది ఆరోగ్య పరిస్థితి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. అయితే రక్తపోటు పడిపోవడం వల్లే కరుణానిధిని ఆసుపత్రికి తీసుకురావాల్సి వచ్చిందని, ప్రస్తుతం ఆయన కోలుకున్నారని వైద్యులు వెల్లడించారు. ఈ మేరకు శనివారం ఉదయం ఓ హెల్త్‌ బులెటిన్‌ కూడా విడుదల చేశారు. కరుణానిధిని ఐసీయూలో ఉంచి.. చికిత్స అందిస్తున్నట్టు కావేరి ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి.
పరామర్శించిన గవర్నర్‌ ..
కావేరి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న డీఎంకే అధినేత కరుణానిధిని తమిళనాడు గవర్నర్‌ భన్వరిలాల్‌ పురోహిత్‌ శనివారం ఉదయం పరామర్శించారు. కరుణానిధి ఆరోగ్య పరిస్థితిని వైద్యులను గవర్నర్‌ అడిగి తెలుసుకున్నారు.  ప్రస్తుతం కరుణానిధికి వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నామని, ప్రస్తుతానికి ఆరోగ్య పరిస్థితి కొంత మెరుగ్గానే ఉందని వైద్యులు గవర్నర్‌కు తెలిపారు. అనంతరం కావేరి ఆస్పత్రిలో ఎంకే స్టాలిన్‌, వైద్య బృందంతో గవర్నర్‌ పురోహిత్‌ సమావేశమై కరుణానిధి ఆరోగ్య పరిస్థితిపై చర్చించారు. కరుణానిధి త్వరగా కోలుకొనేలా మెరుగైన చికిత్స అందించాలని వైద్యులకు సూచించారు.
నాన్న కోలుకుంటున్నారు – కనిమొళి
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత కరుణానిధి ఆరోగ్య పరిస్థితి విషమించడంతో శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఆయనను ఆసుపత్రికి తరలించిన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నట్లు కరుణానిధి కుమార్తె కణిమొళి తెలిపారు. ‘ప్రస్తుతం నాన్న బాగున్నారు. ఆయన రక్తపోటు కూడా సాధారణ స్థాయికి వచ్చిందని కణిమొళి శనివారం విూడియా వర్గాలకు చెప్పారు. కార్యకర్తలు ఎలాంటి ఆందోళనకు గురికావద్దని సూచించారు. కాగా కాంగ్రెస్‌ నేత గులాం నబీ ఆజాద్‌ కూడా ఆస్పత్రికి చేరుకొని కరుణానిధిని పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి స్టాలిన్‌ను అడిగి తెలుసుకున్నారు.