మరోమారు ప్రధానిగా రాహుల్ పేరు
ముంబై భేటీకి ముందే కాంగ్రెస్ వ్యూహాత్మక ప్రకటన
విపక్ష సభ్యుల్లో ఏకాభిప్రాయం వచ్చేనా
ముంబై,సెప్టెంబర్1 జనం సాక్షి : దేశం సార్వత్రిక ఎన్నికలకు సన్నద్దమవుతున్న వేళ మరోమారు కాంగ్రెస్‌లో వారసత్వ రాజకీయాలు తెరపైకి వస్తున్నాయి. తమ ప్రధాని అభ్యర్థి రాహుల్ అంటూ అప్పుడే మెల్లగా స్వరాలు వినిపిస్తున్నాయి. పార్టీలోని భజనబృందం, రాహుల్ గాంధీనే తిరిగి ప్రధాని పీఠం కూచోబెట్టాలని చూస్తోంది. గాంధీయేతర కుటుంబానికి నాయకత్వం అప్పగించాలని డిమాండ్ వస్తున్న తరుణంలో వృద్దనేత మల్లికార్జున ఖర్గేను కూర్చోబెట్టారు. ఆయనది ఉత్సవ విగ్రహం పాత్ర అన్నది అందరికీ తెలిసిందే.
పార్టీలో సైద్దాంతిక విలువలు లేకపోతే ఆ పార్టీ దుస్థితి ఏ విధంగా ఉంటుందో కాంగ్రెస్‌ను చూస్తే అర్థమ వుతుంది. సైద్దాంతిక నిబద్ధత ఉన్న పార్టీగా కాంగ్రెస్ ఎన్నడో చరిత్ర కోల్పోయింది. దృఢ సంకల్పంతో పనిచేసే కార్యకర్తల సంఘటిత సంస్థగా రూపొందించడంలోనూ ఆ పార్టీ నేతలు విఫలమై చాలా కాలమైంది. ఆ ఆపార్టీలో వారసత్వ జాడ్యం వదలలేదనడానికి రాహుల్ ప్రధాని అన్న నినాదమే ఇందుకు నిదర్శనం. ఇదే సమయంలో భారతీయ జనతా పార్టీ ఒక బలమైన సైద్దాంతిక, సువ్యవస్థిత పునాదితో దేశవ్యాప్తంగా విస్తరించే పనిలో పడిరది. బడా నేతల చుట్టూ తిరుగుతూ వారికి భజన చేస్తూ పదవులు పొందే విద్యలో కాంగ్రెస్ వారు దశాబ్దాలుగా ఆరితేరిపోయారు. మరి అటువంటి పార్టీలో సైద్దాంతిక నిబద్ధత ఉంటుందని
అనుకోవడం స్వార్థమే అవుతుంది. ఇవాళ దేశంలో కాంగ్రెస్ దుస్థితి గురించి, దాని లోపాల గురించి మాట్లాడని వారు అంటూ లేరు. కాంగ్రెస్‌ను తీవ్రంగా వ్యతిరేకించేవారో, లేక పూర్తిగా సమర్థించేవారో తప్ప తటస్థంగా నిలబడి బలమైన ప్రతిపక్షం ఏర్పడాల్సిన చారిత్రక ఆవశ్యకత గురించి చెప్పేవారు అసలే కనపడడం లేదు. కాంగ్రెస్ పరిస్థితి గురించి తార్కికంగా విశ్లేషించేవారు లేకుండా పోయారు. ఇకపోతే విపక్షాలకు ఐక్యత కన్నా ప్రధాని పదవిపైనే మక్కువ ఎక్కువ. అందువల్ల రేపటిరోజు కాంగ్రెస్‌తో కలిసి వచ్చేవారు ఎంతమంది అన్నది కూడా అనుమానమే. మొత్తంగా ఇప్పుడు మోడీ ప్రవచించిన ముక్త కాంగ్రెస్ నినాదం వేగంగా విస్తరిస్తోంది. ఇంతటి తోనే ఇది ఆగిపోందనడానికి లేదు. కాంగ్రెస్ పుట్టి మునగకుండా ఆపేవారూ లేరు. విపక్షాలను ఆదరించే వారూ లేరు. తమ పాలిత రాష్టాల్ల్రో ఉన్న వ్యతిరేకతను పక్కదారి పట్టించే ప్రయత్నాల్లో మాత్రమే వీరంతా ఇలాంటి నినాదాలు ఎత్తుకున్నారని చెప్పిక తప్పదు. యూపిఎ పదేళ్ల పాలనలో అనుసరించిన విధానాలు ఎందుకు విఫలం అయ్యాయో, అవి ప్రజలకు ఎందుకు మేలు చేయలేక పోయాయో చెప్పడంలేదు. అలాగే యూపిఎ పదేళ్ల కాలంలో చోటుచేసుకున్న కుంభకోణాలకు నేటికీ సమాధానం చెప్పడంలేదు. ఇవన్నీ చర్చించి..గతంలో తప్పిదాలు..నేటి మోడీ పాలనలో జరుగుతున్న తప్పిదాలు చర్చించి, ప్రత్యామ్నాయం కోసం కూటమిగా ఏర్పడ్డామని చెప్పివుంటే బాగుండేది. ఇకపోతే
విపక్ష కూటమి నాయకుడెవరని కూడా తేల్చలేదు. ఒకవేళ రాహుల్ కాంగ్రెస్ ప్రధాని అభ్యర్థి అయితే తమ అభిప్రాయం ఏమిటన్నది కూడా చెప్పడం లేదు. ఇందులోని వారంతా రాజకీయంగా పదవులు అనుభవించి, ఇప్పుడు మూలనపడుకున్న వారే. తామాంతా కరెక్ట్…మోడీ మాత్రమే రాంగ్ అన్న భావనలో ఉన్నవారే. రాజకీయాల్లో ఇది ఎప్పటి నుంచో ఉంది. ఎదుటివాడే రాంగ్ అన్నది రాజకీయపార్టీల సహజ సిద్ద లక్షణం. కేవలం మోడీకి వ్యతిరేక మనే ప్రాతిపదికన ముందుకు పోతే ప్రజల్లో సానుభూతి పొందలేరు. ముందుగా ఆత్మవిమర్శ చేసుకుంటేనే మంచిది. అప్పుడే ప్రజలు కూడా విపక్షాలను విశ్వసిస్తారు.