మరోమారు రంగంలోకి దిగిన బాబు

ఏలూరు, బుడమేరు కాల్వల పరిశీలన
విజయవాడ,సెప్టెంబర్‌5 ( జనం సాక్షి ) :   నగరంలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు మరోసారి పర్యటించారు. ఎనికేపాడు వద్ద ఏలూరు కాల్వ, బుడమేరు ముంపు ప్రాంతాలను ఆయన పరిశీలించారు. బల్లకట్టుపై బుడమేరు దాటి ముంపు ప్రాంతాల్లో సీఎం పర్యటించారు. గండ్లు పడిన ప్రాంతాల్లో పనులపై అధికారులతో ఆయన చర్చించారు. దెబ్బతిన్న పంటల వివరాలు స్థానికులను అడిగి తెలుసుకున్నారు.
కాగా… భారీ వర్షాలు, వరదలతో ఏపీలో పరిస్థితి దారుణంగా ఉంది. విజయవాడలో అనేక ప్రాంతాలు వరద ముంపునకు గురయ్యారు. ముంపుకు గురైన ప్రాంతాల్లో ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది రెస్క్యూ ఆపరేషన్‌ నిర్వహించి వరద బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. వివిధ రకాలుగా వరద బాధితులు ఆహారం, మంచి నీరు, మందులు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. పడవలు, హెలీకాప్టర్లు, డ్రోన్ల సాయంతో కాలనీల్లో బాధితులకు భోజనాన్ని సరఫరా చేస్తున్నారు. మరోవైపు బుడమేరు వరద నుంచి ఇప్పుడిప్పుడు బెజవాడ వాసులు కాస్త కోలుకుంటున్నారు. వరద తగ్గుముఖం పట్టడంతో బాధితులు ముంపు ప్రాంతాల్లో భారీ ఎత్తున సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్తున్నారు. నిన్న ఉదయానికి నాటికి రెండు నుంచి మూడు
అడుగుల మేర సింగ్‌నగర్‌ దూర ప్రాంతాల్లో వరద మట్టం తగ్గింది. దీంతో గత మూడు రోజులుగా బిక్కుబిక్కుమంటూ గడిపిన వరద బాధితులు బయటకు వచ్చేశారు. సింగ్‌నగర్‌ నుంచి దూరప్రాంతాలైన కండ్రిక, ఆంధప్రభ కాలనీ, రాజీవ్‌నగర్‌, ప్రకాష్‌నగర్‌, ఎల్‌బీఎస్‌ నగర్‌, రాధానగర్‌, డాబాకొట్లు సెంటర్‌, ఇందిరానాయక్‌ నగర్‌, పైపులరోడ్డు, తదితర ప్రాంతాల నుంచి వేలాదిగా వరద బాధితులు సురక్షిత ప్రాంతాలకు పోటెత్తారు. కాగా… బాధితుల తరలింపు తక్కువగా ఉండటం వల్ల అగ్నిమాపక శకటాలు తమ పనులు నిర్వహించలేకపోయాయి. స్వచ్ఛంద సంస్థలు, రాజకీయ పార్టీల నాయకుల పంపిన ట్రాక్టర్లు బాధితుల రాకపోకలకు ఎంతగానో ఉపయోగపడ్డాయి. వరద నుంచి వచ్చే బాధితులు దాదాపుగా నాలుగు నుంచి పది కిలో విూటర్ల మేర నడుచుకుని రావటంతో వారికి స్వాంతన కలిగించేందుకు స్వచ్ఛంద సంస్థలు ఆటోలు, లారీలు, మినీవ్యాన్‌లు, ట్రాక్టర్ల వంటివి పెద్ద సంఖ్యలో నడిపాయి. పైపులరోడ్డు, గొల్లపూడి, తదితర ప్రాంతాల్లో ఈ పరిస్థితి కనిపించింది.