మరోమారు రెచ్చిపోయిన ఎర్రకూలీలు
ఎదురుదాడిలో ఓ ఉద్యోగి మృతి
అడవుల్లో జల్లెడ పడుతున్న టాస్క్‌ఫోర్స్
కడప,జూలై26(జనంసాక్షి): మరోమారు ఎర్రదొంగలు రెచ్చిపోవడంతో ఓ అటవీ అధికారి ప్రాణాలు కోల్పోయాడు. దీంతో ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకున్న పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు. అడవుల్లో ఉన్న తమిళ కూలీలను తరిమేందుకు సిద్దమయ్యారు. కడప జిల్లా సిద్దవటం రేంజ్ రోలబోడు బీటులోని బుక్కరాయ అటవీ ప్రాంతంలో ఎర్రచందనం కూలీలు రెచ్చిపోయారు. కూంబింగ్ నిర్వహిస్తూ తమ కంట పడిన అటవీ శాఖ సిబ్బందిపై దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో అటవీ శాఖ తాత్కాలిక ఉద్యోగి అశోక్(31) ప్రాణాలు కోల్పోయాడు. బుక్కరాయ అటవీ ప్రాంతంలో తమిళ కులీలు ఎర్రచందనం అక్రమ రవాణా పాల్పడుతున్నారని సమాచారం తెలుసుకున్న సిద్దవటం అటవీ శాఖ అధికారి ప్రసాద్, బీట్ అధికారి సుబ్రహ్మణ్యం మరో నలుగురు స్టైక్రింగ్ ఫోర్సు సిబ్బంది రోలబోడు అటవీ ప్రాంతానికి వెళ్లగా కూలీలు తారసపడ్డారు. ఆ సమయంలో అటవీ సిబ్బందిపై తమిళ కూలీలు ఒక్కసారిగా దాడికి యత్నించారు. దీంతో అటవీ సిబ్బంది రెండు రౌండ్లు గాలిలోకి కాల్పులు జరిపారు. అనంతరం అటవీ శాఖ సిబ్బంది తమిళ కూలీలను పట్టుకునే ప్రయత్నం చేయగా.. వారు సిబ్బందిపై ఎదురుదాడి చేశారు. ఈ ఘటనలో అశోక్ అనే ఫారెస్ట్ ఉద్యోగి తీవ్రంగా గాయపడి మృతి చెందాడు. చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం సచ్చినోడు బండ సవిూపంలో ఈ ఉదయం ఎర్రచందనం ప్రత్యేక కార్యదళం కూంబింగ్ నిర్వహించింది. ఈ సందర్భంగా నలుగురు స్మగ్లర్లను కార్యదళం అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఎర్రచందనం కూలీలు తిరుగుతున్నారన్న సమాచారంతో కూంబింగ్ నిర్వహిస్తున్న ప్రత్యేక కార్యదళానికి సచ్చినోడు బండ సవిూపంలో కూలీలు తారసపడ్డారు. టాస్క్ ఫోర్స్ సిబ్బంది వారిని అదుపులోకి తీసుకునే ప్రయత్నంలో కూలీలు కార్యదళంపై రాళ్లతో ఎదురు దాడికి దిగారు. పరిస్థితిని అదుపులోకి తీసుకునేందుకు ఎర్రచందనం ప్రత్యేక కార్యదళం అధికారులు ఒక రౌండు గాల్లోకి కాల్పులు జరిపారు. నలుగురు ఎర్రచందనం కూలీలతో పాటు, 21 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. అదనపు బలగాలతో కూంబింగ్ కొనసాగిస్తున్నట్లు టాస్క్‌ఫోర్స్ ఐజీ కాంతారావు తెలిపారు.