మరో మూడు విడతల్లో ఎస్సారెస్పీ నీటిని విడుదల చేయాలి
ఎలిగేడు: ఎస్సారెస్సీ సాగునీటిని మరో మూడు విడతల్లో సరఫరా చేసి రైతులు సాగు చేసుకున్న ఆరుతడి పంటలను
కాపాడాలని పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణరావు ప్రభుత్వాన్ని కోరారు. మంగళవారం ఎలిగేడు మండలంలోని ఎస్సారెస్సీ బి-86 ప్రధాన కాలువ నీటి సరఫరాను ఎమ్మెల్యే అధికారులతో కలసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ సూచనల మేరకే రైతులు ఎస్సారెస్పీ కాల్వల పరిధిలో 90వేల ఎకరాల వరకు ఆరుతడి పంటలను సాగు చేసుకున్నారని చెప్పారు. ఈ పంటలకు 950 క్యూసెక్యుల సాగునీరు అవసరం కాగా, ప్రస్తుతం అశించిన మేరకు నీటిని విడుదల చేయడం లేదని తెలిపారు. కాలువలు శిధిలమవుతూ అధ్వాన స్థితికి చేరుతున్నప్పటీకీ మరమ్మతు చేయడంలో ప్రభుత్వం పట్టించుకోకుండా పదేళ్లుగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు. ఖరీఫ్ వరకు కాల్వలను అధునీకరించాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో ఎస్సారెస్సీ ఈఈ భద్రయ్య, డిప్యూటీ ఈఈలు శ్రీనివాసరావు, లక్షీకాంతరావు తదితరులు పాల్గొన్నారు.