మరో రకంగా జమిలికి సిద్దం అవుతున్న బిజెపి

వివిధ రాష్ట్రాలతో పాటు కేంద్ర ఎన్నికలకు సన్నద్దత

టిఆర్‌ఎస్‌ కూడా ఇందుకు సిద్దం అన్న సంకేతాలు?

డిసెంబర్‌లో ఏకకాల ఎన్నికలకు ప్లాన్‌

న్యూఢిల్లీ/హైదరాబాద్‌,ఆగస్ట్‌15(జ‌నం సాక్షి): జమిలి ఎన్నికల నిర్వహణ అసౄద్యమంటూ కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేయడంతో,తదుపరి కార్యాచరణలో బిజెపి పడినట్లు సమాచారం. ఇప్పటికిప్పుడు జమిలి ఎన్‌ఇనకలు నిర్వహించడం కుదరదని సిఇసి తెలిపారు. ముందస్తు ఎన్నికలతో వివిధ రాష్ట్రాలతో కలసి ముందుకు వెళ్లే ఆలోచనలో కూడా బిజెపి ఉన్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్‌, ఇతర విపక్ష పార్టీలు కలసి ఉమ్మడిగా బిజెపిని ఎదుర్కోవాలని చూస్తున్నాయి. అయితే వాటికి తగిన సమయం ఇవ్వకుండా 2019 సాధారణ ఎన్నికలతో పాటు పదకొండు రాష్ట్రాలకు ఒకేసారి శాసనసభ ఎన్నికలు కూడా జరపాలన్నది కేంద్ర ప్రభుత్వ ఆలోచనగా ఉందని సమాచారం. ఇందుకు ప్రత్యేకంగా రాజ్యాంగ సవరణ అవసరంలేదన్నది కేంద్రంలో అదికారంలో ఉన్న బిజెపి అభిప్రాయంగా ఉందని అంటున్నారు. ఈ ఏడాది చివర్లో ఎన్నికలు జరగనున్న మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌, రాజస్తాన్‌లతోపాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, ఒడిశా, మిజోరంలకు

ఒకేసారి ఎన్నికలు నిర్వహించవచ్చని భావిస్తున్నారు. అధిష్టానంతోపాటు పార్టీలోనూ ఒకేసారి ఎన్నికలు జరపడం ద్వారా మోదీ హవా.. రాష్ట్రాల అసెంబ్లీల్లోనూ ప్రతిబింబిస్తుందని, రాష్ట్ర ప్రభుత్వాలపై ఉన్న వ్యతిరేకతను ఎదుర్కొనవచ్చని బీజేపీ నాయకులు భావిస్తున్నారు. నిజానికి బిజెపి పాలిత రాష్ట్రాల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. ముందుగానే ఈ రాష్ట్రాలకు ఎన్నికలు నిర్వహిస్తే అక్కడ అధికారం కోల్పోతే దఆని ప్రభావం వచ్చే కేంద్ర ఎన్నికలపైన ఉంటుందని బిజెపి నేతలు విశ్లేషిస్తున్నారు. అయితే విపక్షాలు

మాత్రం ఇది సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధమంటున్నాయి.తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్‌ కూడా ఇందుకు తగ్గట్లుగానే తయారవుతున్న సూచనలు అందుతున్నాయి. కేంద్రంతో పాటే ఆయన ఎన్నికలకు సన్నద్దం అవుతున్నారు. ఇటీవల అనూహ్యంగా ఆయన కార్యవర్గ భేటీ జరపడం, 17న ఎంపిలు, ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహించడం కూడా ముందస్తు వ్యూహంలో భాగమని భావిస్తున్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్‌ ప్రకటనను గమనిస్తే డిసెంబర్‌,జనవరిలలో ఎన్నికలు జరగవచ్చనిపిస్తుంది. సెప్టెంబర్‌ రెండున ప్రగతి నివేదన పేరుతో ఔటర్‌ రింగ్‌ రోడ్డు పరిసరాలలో భారీ బహిరంగ సభను నిర్వహిస్తామని ఆయన చెప్పారు. అంతేకాక సెప్టెంబర్‌లో శాసనసభ ఎన్నికలలో పోటీచేసే అభ్యర్దుల జాబితాను ప్రకటిస్తామని కూడా ఆయన తెలిపారు. అలాగే వచ్చే ఎన్నికట్లో టీఆర్‌ఎస్‌ ఒంటరిగానే పోటీ చేస్తుందన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరితోనూ పొత్తులు ఉండవన్నారు. మరోవైపు కెసిఆర్‌ ముందుగా ఎన్నికలకు వెళ్లడానికి వీలుగా ఆయన శాసనసభను రద్దు చేయవచ్చని విూడియాలో కథనాలు వస్తున్నాయి. నవంబర్‌ చివరి వారం లేదా, డిసెంబర్‌ మొదటి వారంలో ఎన్నికలు జరగాలని ఆయన కోరుకుంటున్నారని చెబుతున్నారు.దానికి తగినట్లుగా సెప్టెంబర్‌ చివరి వారం లేదా అక్టోబర్‌ మొదటి వారంలో శాసనసభ రద్దయ్యే అవకాశం ఉందని అంటున్నారు. అయితే అలా గాకుండా కేంద్రానికి అనుగునంగా ఇతర రాష్ట్రాలతో పాటు ఎన్నికలకు వెళ్లడానికి సంకేతాలు ఇచ్చారని ఆయన ప్రకటనలు సూచిస్తున్నాయి.. షెడ్యూల్‌ ప్రకారం వచ్చే ఏడాది మేలో లోక్‌సభతో పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీలకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. లోక్‌సభ ఎన్నికల కంటే ముందే అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు మొగ్గు చూపుతున్నారు. నవంబర్‌ లేదా డిసెంబర్‌లో జరగనున్న మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌, రాజస్తాన్‌, మిజోరాం అసెంబ్లీ ఎన్నికలతోపాటే తెలంగాణ శాసనసభ ఎన్నికలు జరిపేందుకు సీఎం కెసిఆర్‌ సిద్దంగా ఉన్నారని అంటున్నారు.