మలివిడత బాబు తెలంగాణ పర్యటనపై కసరత్తు
కరీంనగర్/మెదక్,ఫిబ్రవరి20 ( జనంసాక్షి)
: వరంగల్ పర్యటన తరవాత చంద్రబాబు నాయుడి తరవాత పర్యటన కరీంనగర్‌లో మార్చి 3నఉంటుందని ఇప్పటికే పార్టీ వర్గాలు వెల్లడించాయి. కరీంనగర్ జిల్లాలో పర్యటించనున్న చంద్రబాబునాయుడు పర్యటన కార్యక్రమాలను విజయవంతం చేసే విషయంపై జిల్లా పార్టీ నేతలు కసరత్తు ప్రారంభించారు. హైదరాబాద్ నుంచి పర్యటన ప్రారంభంలో మెదక్ జిల్లాలో గజ్వెల్, సిద్దిపేటల్లో కూడా సభలు పెట్టే ఆలోచన చేస్తున్నారు. హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో జిల్లా, రాష్ట్ర నేతలతో ఆ పార్టీ ముఖ్య నేత లోకేశ్ సమావేశమై బాబు పర్యటనను విజయవంతం చేయాలని సూచించారు. ఈనెల 23 నుంచి 28 వరకు జరిగే నియోజకవర్గస్థాయి సమావేశాలకు రాష్ట్ర అధ్యక్షుడితో పాటు రాష్ట్ర నేతలు దయాకర్‌రావు, రేవంత్‌రెడ్డి, పెద్దిరెడ్డి, నర్సింహులు, నర్సారెడ్డిలు హాజరై పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం తీసుకురావాలని నిర్ణయించారు. ఈ మేరకు ఈనెల 23న మానకొండూర్, చొప్పదండి, 25న కరీంనగర్, హుజురాబాద్, హుస్నాబాద్, 26న కోరుట్ల, జగిత్యాల, ధర్మపురి, 27న రామగుండం, మంథని, పెద్దపల్లి, 28న వేములవాడ, సిరిసిల్లలో నియోజకవర్గ స్థాయి సమావేశాలు జరుగుతాయి. మార్చి 3న చంద్రబాబునాయుడు హైదరాబాద్ నుంచి కరీంనగర్‌కు చేరుకొని వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈ క్రమంలో మార్గమధ్యలో ఉన్న గజ్వేల్ నియోజకవర్గ పరిధిలోని ప్రజ్ఞాపూర్‌తో పాటు సిద్దిపేటలో ఆయన కొంతసేపు ఆగే అవకాశం ఉంది. ప్రజ్ఞాపూర్ చౌరస్తా, సిద్దిపేట పాతబస్టాండ్ వద్ద తెదేపా కార్యకర్తలు, ప్రజలను ఉద్దేశించి ప్రసంగించే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. పార్టీ జిల్లా అధ్యక్షురాలు శశికళ యాదవరెడ్డిలు ఈ మేరకు పార్టీ పెద్దలతో చర్చించి కార్యక్రమాన్ని ఖరారు చేశారు. తెలంగాణ టిడిపి అధ్యక్షుడు ఎల్.రమణతో ఈ విసయమై చర్చించారు. కరీంనగర్ పర్యటన నేపథ్యంలో గజ్వేల్, సిద్దిపేట నియోజకవర్గ పార్టీ నేతల్లో ఉత్సాహం నింపడానికి రెండు చోట్ల చంద్రబాబు ఆగేలా చూడాలని వారు కోరారు. వారి విజ్ఞప్తి మేరకు రమణ విషయాన్ని బాబు దృష్టికి తీసుకెళ్లగా సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. చిన్నకోడూరు మండలం రామునిపట్ల వద్ద పార్టీ పతాకాన్ని ఆవిష్కరించే అవకాశం కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఇందకు నేతలు కార్యాచరణ రూపొందిస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు ఏర్పాట్లు చేస్తున్నారు.