మల్టీప్లెక్స్‌ల్లో నిలువు దోపిడీపై కొరడా

– ఐదు మల్టీప్లెక్స్‌లకు రూ.25 లక్షల జరిమానా!
– విజయవాడలోని వినియోగదారుల న్యాయస్థానం సంచలన తీర్పు
– మంచినీరు, తినుబండారాలు థియేటర్‌లోకి అనుమతించాలి
– ఆదేశాలు అమలయ్యేలా చూడాలని తూనికలు, కొలతలశాఖకు న్యాయస్థానం ఆదేశం
విజయవాడ, ఆగస్టు9(జ‌నం సాక్షి) : వినియోగదారులను నిలువునా దోచుకుంటున్న మల్టీప్లెక్స్‌లపై విజయవాడలోని వినియోగదారుల న్యాయస్థానం ఊహించని ఝలక్‌ ఇచ్చింది. నిబంధనలను తుంగలో తొక్కి అధిక ధరలతో వస్తువులు విక్రయిస్తున్న నగరంలోని ఐదు మల్టీఫ్లెక్స్‌ల యాజమాన్యాలకు రూ.25 లక్షల భారీ జరిమానా విధించింది. బయట నుంచి తెచ్చుకునే తినుబండారాలు, మంచినీరును థియేటర్లలోకి అనుమతించాలని ఆదేశాలు జారీ చేసింది. తమ ఆదేశాలు సక్రమంగా అమలయ్యేలా చూడాలని తూనికలు, కొలతల శాఖను ఆదేశించింది. మల్టీప్లెక్స్‌ థియేటర్లలో టిక్కెట్లు, ఆహార పదార్థాలను అధిక ధరలకు విక్రయిస్తున్నారంటూ మార్గదర్శక సమితి సహకారంతో కొందరు గతేడాది ఏప్రిల్‌లో వినియోగదారుల ఫోరంలో ఫిర్యాదు చేశారు. ముఖ్యంగా ఎల్‌ఈపీఎల్‌, ట్రెండ్‌సెట్‌, పీవీఆర్‌, పీవీపీ, ఐమ్యాక్స్‌ థియేటర్లపై చర్యలు తీసుకోవాలని వారు కోరారు. దీనిని విచారణకు స్వీకరించిన కన్జ్యూమర్‌ ఫోరం మల్టీఫ్లెక్స్‌ యాజమాన్యాలతోపాటు తూనికలు, కొలతల శాఖకు నోటీసులు జారీచేసింది. దీనిపై అనేక సార్లు వాద ప్రతివాదాలు జరగ్గా సమగ్ర విచారణ అనంతరం గురువారం తీర్పును వెల్లడించింది. న్యాయమూర్తి మాధవరావు ఈ అంశంపై సంచలన తీర్పు వెలువరించారు. మల్టీప్లెక్స్‌ యాజమాన్యాలు ఎమ్మార్పీ కంటే మూడురెట్లు అధికంగా ధరను ముద్రించి వినియోగదారులను మోసం చేసినట్టు న్యాయమూర్తి తన తీర్పులో పేర్కొన్నారు. అందుకే వినియోగదారులు నష్టపోయిన మొత్తాన్ని 9శాతం వడ్డీతో సహా పరిహారంగా చెల్లించాలని ఆదేశించారు. ఒక్కొక్క థియేటర్‌కు రూ.5 లక్షల చొప్పున మొత్తం రూ.25 లక్షల జరిమానాగా విధించారు. దీన్ని రెండు నెలలల్లోగా జిల్లా వినియోగదారుల ఫోరంలో జమచేయాలని ఆదేశించారు.  ఇలాంటి మోసాలకు పాల్పడటం తీవ్రమైన నేరమని, భవిష్యత్‌లో పునావృతం కాకుండా తగు చర్యలు తీసుకోవాలని ఉద్ఘాటించారు. అంతేకాదు థియేటర్లకు వచ్చే ప్రేక్షకులకు ఉచిత తాగునీరు సహా అన్ని సౌకర్యాలు కల్పించాలని, బయట నుంచి తీసుకొచ్చే ఆహార పదార్థాలు, శీతల పానీయాలను అనుమతించాలని ఆదేశించారు.