మల్లన్న సాగర్‌ పంపుల ప్రారంభం ఆనందం


ఈ ప్రాంత ప్రజల ఆకాంక్షలు నెరవేరాయి: వంటేరు
సిద్దిపేట,ఆగస్ట్‌23(జనంసాక్షి): తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టులో మరో కీలక ఘట్టం ఆవిష్కృతం కావడంతో ఈ ప్రాంత రైతాంగానికి ఇచ్చిన హావిూ నెరవేరిందని అటవీ అభివృద్ది సంస్థ చైర్మన్‌ వంటేరు ప్రతాపరెడ్డి అన్నారు. గోదావరి జలాలు కొమురవెల్లి మల్లన్నసాగర్‌ రిజర్వాయర్‌లోకి
అడుగుపెట్టడం ఈ ప్రాంత రైతాంగం చేసుకున్న అదృష్టమన్నారు. సిద్దిపేట జిల్లా తొగుట మండలం తుక్కాపూర్‌ పంపుహౌస్‌ వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి మోటార్లను ప్రారంభించారు. పంపుల నుంచి దూసుకెళ్లిన గోదావరి నీళ్లు.. గలగలమంటూ మల్లన్నసాగర్‌లోకి అడుగుపెట్టాయి. మల్లన్నసాగర్‌ రిజర్వాయర్‌లో నీటిని నింపాలని సీఎం కేసీఆర్‌ ఆదేశించడంతో..అధికారులు కొద్దిరోజులుగా రాత్రింబవళ్లు కష్టపడ్డారు. ట్రయల్‌రన్‌ విజయవంతం కావడంతో సంబరాలు జరుపుకొన్నారు. మల్లన్నసాగర్‌లో ప్రస్తుతం 10 టీఎంసీల నీటిని నింపాలని లక్ష్యంగా పెట్టుకున్నారు అధికారులు. తుక్కాపూర్‌ పంపుహౌజ్‌లోని మొత్తం ఎనిమిది పంపులకుగాను..మూడు పంపుల ద్వారా నీటిని ఎత్తిపోస్తున్నారు. ఒక్కో మోటార్‌ ద్వారా రోజుకు 1.5 టీఎంసీల నీటిని పంపింగ్‌ చేసే అవకాశం ఉంది. ఇలా మూడిరటిని పూర్తిస్థాయిలో నడిపితే..రెండు, మూడు రోజుల్లోనే మల్లన్నసాగర్‌లో 10 టీఎంసీలు చేరే అవకాశం ఉంది.