మళ్లీ ఎంపీగానే పోటీచేయాలనుంది
– ఎంపీగానా.. ఎమ్మెల్యేగానా అనేది అధిష్టానం నిర్ణయిస్తుంది
– ప్రజలకు బీజేపీ న్యాయం చేయలేక పోయింది
– ధర్మాబాద్‌లో పోలీసులు తమపట్ల దారుణంగా ప్రవర్తించారు
– మాజీ కేంద్ర మంత్రి అశోక గజపతిరాజు
అమరావతి, సెప్టెంబర్17(జనంసాక్షి) : మళ్లీ తనకు ఎంపీగానే పోటీ చేయాలనుందని, ఎంపీగానా.. ఎమ్మెల్యేగానా అనేది పార్టీ అధిష్టానం నిర్ణయిస్తుందని మాజీ కేంద్ర మంత్రి, తెదేపా ఎంపీ అశోక గజపతిరాజు అన్నారు. సోమవారం అసెంబ్లీలోని సీఎం ఛాంబర్‌లో ముఖ్యమంత్రిని కలిసిన ఆయన ధర్మాబాద్ న్యాయస్థానం నోటీసులు, పరిణామాలపై చర్చించారు. అనంతరం టీడీఎల్పీలో విలేకరులతో ముచ్చటించారు. భాజపా తనకు దక్కిన అవకాశాన్ని కేంద్రంలో సద్వినియోగం చేసుకోలేకపోయిందని అభిప్రాయపడ్డారు. ప్రజలు మంచి చేస్తారని బీజేపీకి అవకాశం కల్పిస్తే అటు ఏపీకి తీవ్ర అన్యాయం చేయడంతో పాటు దేశ ప్రజలకు పూర్తిస్థాయిలో న్యాయం చేయలేకపోయిందని అన్నారు. జాతీయ పార్టీలు ప్రజాదరణ తగ్గిపోతుందని, ప్రాంతీయ పార్టీలకే ప్రజలు జై కొడుతున్నారని అన్నారు. బాబ్లీ పోరాటం, ధర్మాబాద్ పోలీస్ తీరును గుర్తుచేసుకున్నారు. ధర్మాబాద్‌లో పోలీసులు తెలుగుదేశం నేతల పట్ల దారుణంగా వ్యవహరించారని, తాగునీటి కోసం కూడా తీవ్ర ఇబ్బంది పెట్టారని అశోక గజపతిరాజు తెలిపారు. తెలంగాణ రైతుల కోసం టీడీపీ చారిత్రక పోరాటం చేసిందని ఆయన తెలిపారు. జగన్ తన తండ్రి రాజ్యం తెస్తానని అంటున్నారని, ఆనాటి దారుణ పాలన ఎవరికీ అవసరం లేదని వ్యాఖ్యానించారు. ఆనాటి దారుణ పాలన ఎవరికీ అవసరం లేదని అశోక్‌గజపతి చెప్పారు. జంజావతి విూద వైఎస్
రాజశేఖర్‌రెడ్డి నిర్మించిన రబ్బర్ డ్యాం ఎలా కొట్టుకు పోయిందో జగన్ తెలుసుకోవాలని ఆయన సూచించారు. తన కుమార్తె ఎన్నికల్లో పోటీ చేసే విషయంపై తానేవిూ ఏమి చెప్పలేనన్నారు. రాజకీయాలంటే అంత సులభం కాదని అభిప్రాయపడ్డారు.